ఢిల్లీలో మహిళా ఎస్సై దారుణ హత్య

8 Feb, 2020 08:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ మహిళా పోలీసు అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని మెట్రో స్టేషను సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన వేళ.. ఇలా ఓ మహిళా ఎస్సై హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. వివరాలు... హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ప్రీతి అహ్లావత్‌(26) 2018లో పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆమెకు తూర్పు ఢిల్లీలోని పట్పార్గంజ్‌ పారిశ్రామిక ప్రాంతంలో ఎస్సైగా పోస్టు లభించింది. అప్పటి నుంచి ప్రీతి.. రోహిణి ప్రాంతంలో బస చేస్తూ విధులు నిర్వరిస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం విధులు ముగించుకున్న ప్రీతి.. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో.. రోహిణి మెట్రో స్టేషను నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించామని.. అయితే అతడిని ఇంతవరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.(ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

కాగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రీతి హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు పరిచయం ఉన్న దీపాంశు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం హర్యానాలోని తన ఇంటికి వెళ్లి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇక దీపాంశు కూడా ఢిల్లీలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు