పోలీసులకే టోకరా.. 18 నెలలు వీఐపీ సేవలు..!

5 Apr, 2019 10:34 IST|Sakshi

నకిలీ ఐడీ కార్డులతో యువతి మోసం

న్యూఢిల్లీ : ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఉద్యోగినంటూ పోలీసులకు టోకరా ఇచ్చి 18 నెలల పాటు రాచమర్యాదలు చేయించుకున్న ఓ యువతి బండారం బట్టబయలైంది. భర్తతో కలిసి ప్రభుత్వ అధికారులను మోసగించినందుకు కటకటాల పాలైంది. ఢిల్లీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. వివరాలు... సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగం పొందాలనుకున్న జోయాఖాన్‌ (35) ఆ కోరిక నెరవేరక పోవడంతో సరికొత్త మోసానికి తెరలేపింది. ఎలాగూ ఉద్యోగం రాలేదు. కానీ, ఆ జాబ్‌లోని ‘మజా’ ఎంజాయ్‌ చేద్దామని తన భర్త హర్ష్‌ ప్రతాప్‌ (40)తో కలిసి నకిలీలలు చేసింది. ఫేక్‌ ఐడీ కార్డులు సృష్టించి ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గల నొయిడా, గురుగ్రామ్‌, మీరట్‌, ఘజియాబాద్‌, మోరాదాబాద్‌లో ఎస్కార్ట్‌, పోలీసు సేవల్ని యథేచ్ఛగా  వాడుకుంది.

ఎలా బయటపడింది..?
ఈ క్రమంలోనే మార్చి 23న గౌతమ్‌బుద్ధ నగర్‌ (నొయిడా) ఏఎస్పీ వైభవ్‌ కృష్ణకి ఫోన్‌ చేసిన ఖాన్‌ పోలిస్‌ ఎస్కార్టును పంపడంలో ఆలస్యమవడం పట్ల కోపం ప్రదర్శించింది. తొందరగా పంపించాలని హుకుం జారీ చేసింది. దీంతో ఈ ‘ఉన్నత ఉద్యోగి’ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఏఎస్పీ విచారణ చేపట్టారు. ఖాన్‌, ప్రతాప్‌ గుట్టు రట్టు కావడంతో వారు నివాసముంటున్న నొయిడా ఎక్స్‌టెన్షన్స్‌ నుంచి గురువారం అరెస్టు చేశారు. జోయాఖాన్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో న్యూక్లియర్‌ ఆఫీసర్‌గా, అఫ్గనిస్తాన్‌లో యూఎస్‌ దౌత్యవేత్తగా నకిలీ ఐడీ కార్డులు కలిగి ఉందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు విలువైన కార్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక అఫ్గనిస్తాన్‌ తదితర దేశాలతో కూడా జోయాఖాన్‌ వ్యవహారాలు నడిపించిందా అనే ప్రశ్నలను పోలీసులు ఖండించారు. అదంతా అబద్ధమని అన్నారు. 

ఇలా టోకరా..
వాయిస్‌ కన్వర్టర్‌ యాప్‌, యూఎస్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ పేరిట ఫేక్‌ ఈమెయిల్‌ ద్వారా ఖాన్‌ పోలీసులను బురిడీ కొట్టించినట్టు తెలిసింది. ల్యాండ్‌లైన్‌ ద్వారా ఫోన్‌ చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి రాలేదని పోలీసులు తెలిపారు. ఇక గతవారం ప్రధాని మోదీ మీరట్‌లో పర్యటించినప్పుడు కూడా ఖాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆమె నకిలీ వేషాలను నమ్మిన చాలా మంది ఆమెను ప్రధాని రక్షణ దళంలో సభ్యురాలు అని కూడా అనుకున్నారు. కాగా, ఆమె ల్యాప్‌టాప్‌లో పలువురు రాజకీయ నాయకుల ఫొటోలు ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె వాట్సాప్‌, సోషల్‌ మీడియా చరిత్రను విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇక నిన్నటి వరకు వీఐపీ సేవల్లో తరించిన ఖాన్‌, ప్రతాప్‌ అరెస్టులతో స్థానికులు భయాందోళను గురయ్యారు. పోలీసులు, ఉన్నతాధికారులకే టోకరా ఇచ్చిన ఈ ఘరానా మోసగాళ్లు తమనేం చేసేవారోనని కలవరానికి గురయ్యారు.

మరిన్ని వార్తలు