పాఠశాలలో రూ.74 లక్షలు చేతివాటం

6 Aug, 2018 08:58 IST|Sakshi
ప్రిన్సిపాల్‌ క్రిష్టినా

మహిళా ప్రిన్సిపాల్‌ అరెస్టు

టీ.నగర్‌: చెన్నై పుళిదివాక్కం పాఠశాలలో రూ.74 లక్షలు మేరకు చేతివాటాన్ని ప్రదర్శించిన మహిళా ప్రిన్సిపాల్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పుళిదివాక్కంలో తిరుజ్ఞాన సంబంధం (ప్రభుత్వ గుర్తింపు పొందిన) కాన్వెంట్, ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలను నడుపుతున్నారు. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పుళిదివాక్కం నార్త్‌ రాంనగర్‌కు చెందిన క్రిష్టినా 2017లో విధుల్లో చేరారు. ఆమె పాఠశాలలో చేరినప్పటి నుంచి ఆమె చర్యలు యాజమాన్యానికి సంతృప్తి కలిగించలేదు. ఇలా ఉండగా ప్రైవేటు సంస్థ ద్వారా పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ప్రకటనలు విడుదల చేశారు. దీనిని గమనించి పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో క్రిష్టినా వారిని వేరొక పాఠశాలకు పంపడమే కాకుండా కమిషన్లు అందుకున్నట్లు తెలిసింది.

విద్యార్థుల అడ్మిషన్లు తగ్గడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది. దీనికి కారణం క్రిష్టినాగా తెలిసింది. అంతేకాకుండా పాఠశాల ఖర్చుల కోసం క్రిష్టినాకు లక్షా 90వేల రూపాయలను యాజమాన్యం అందజేసింది. ఈ నగదు గురించి ఆమెను ప్రశ్నించగా అందుకు తగిన సమాధానం చెప్పలేదు. పాఠశాల విద్యార్థుల విద్యా ఫీజుల్లోనూ చేతివాటం ప్రదర్శించినట్టు తెలిసింది. ఈ మేరకు రూ.74 లక్షలు మోసగించినట్లు కనుగొన్నారు. దీని గురించి తిరుజ్ఞాన సంబంధం మడిపాక్కం పోలీసులకు క్రిష్టినా, మరో పాఠశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి క్రిష్టినాను ఆదివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో పాఠశాల నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు