రాసలీలలు.. టీఆర్‌ఎస్‌ నేతపై వేటు

25 Jul, 2018 19:07 IST|Sakshi
బాధిత మహిళ

పదవులకు రాజీనామా చేసిన ఎక్కటి సంజీవరెడ్డి

పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నేత

అంతకుముందు మంత్రి ఈటల ఇంటిముందు బాధిత మహిళ ఆందోళన

సాక్షి, కరీంనగర్‌ : ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ నేత ఎక్కటి సంజీవరెడ్డిపై వేటు పడింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట దేవస్థానం చైర్మన్‌గా ఉన్న ఆయన ఆరోపణల నేపథ్యంలో తన పదవులకు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి, పార్టీ స్వభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. అంతకుముందు తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ కరీంనగర్‌లోని మంత్రి ఈటల ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపారు. సంజీవరెడ్డిని పదవుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె ఆందోళన నేపథ్యంలో ఎక్కడి సంజీవరెడ్డి స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు.

సంఘటన వివరాలివి..
కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌గా ఎక్కటి సంజీవరెడ్డి కొనసాగుతున్నాడు. మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి కల్లు తాగేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు అధికారులు, బడా నాయకులు తెలుసని పేర్కొంటూ సదరు మహిళా భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన మహిళ రెండేళ్లక్రితం వారికున్న 20 గుంటల భూమిని విక్రయించగా వచ్చిన రూ.మూడు లక్షలు సంజీవరెడ్డికి ఇచ్చింది. రెండేళ్లయినా ఉద్యోగం కల్పించకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అందరికీ చెబుతానని తీవ్రంగా కొట్టాడు. ఆ సమయంలో అడ్డుగా వచ్చిన ఆమె భర్తపైనా దాడికి పాల్పడ్డాడు. తన మాట వినాలని, లేకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించాడు. ఈ విషయమై స్థానికంగా కొద్దిరోజులుగా పంచాయితీలు కూడా నడుస్తున్నట్లు సమాచారం.

పట్టించుకోని పోలీసులు..  
తనపై, తన భర్తపై దాడి చేశాడని పేర్కొంటూ.. సదరు మహిళా న్యాయం కోసం ఇల్లందకుంట పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కనీసం పట్టించుకోలేదు. సంజీవరెడ్డి పెద్ద హోదాలో ఉన్నాడని, ఆయనపై ఇచ్చిన ఫిర్యాదును మార్పు చేయాలంటూ ఎస్సై నరేశ్‌కుమార్‌ నాలుగు గంటలపాటు ఒత్తిడి తెచ్చారని మహిళ మీడియా ఎదుట వాపోయింది. వివాహేతర సంబంధం కాకుండా భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ కోసం వచ్చినట్లు రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. ఈ విషయమై ఎస్సై నరేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సంజీవరెడ్డి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు.. డబ్బులు కూడా ఇచ్చేది ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చిందని, పూర్తి సమాచారం తెలుసుకునేందుకే కొంత సమయం తీసుకున్నానని, ఫిర్యాదును మార్చాలని తాను మహిళపై ఒత్తిడి తేలేదని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు