తల్లి నిరాకరించిందని...పసికందుపై..

26 Jun, 2019 09:09 IST|Sakshi

చల్లని సాయంత్రం వేళ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో వీకెండ్‌ పార్టీ జరుగుతోంది. డిజైరీ మెనాగ్‌ తన పది నెలల చిన్నారితో కలిసి అక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాడో.. అసలు ఆహ్వానం ఉందో లేదో తెలియదు కానీ మార్కో ఎచార్టీ(23) కూడా పార్టీకి వచ్చాడు. స్నేహితులతో సరదాగా గడుపుతున్న డిజైరీని చూడగానే అతడిలోని మానవ మృగం నిద్రలేచింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న డిజైరీ అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దూరంగా తోసివేసి తన బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయినప్పటికీ మార్కో ఆమెను వెంటాడుతూనే ఉన్నాడు. ఏ చోటికి వెళ్లినా అక్కడికి వెళ్లి డిజైరీని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దీంతో ఇంటికి వెళ్తేనే కాస్త ప్రశాంతంగా ఉంటుందని..స్నేహితుడి సహాయంతో క్యాబ్‌ బుక్‌ చేసుకుంది డిజైరీ. కానీ కొంతదూరం వెళ్లగానే కారు ట్రబుల్‌ ఇవ్వడంతో మళ్లీ పార్టీ జరుగుతున్న చోటికే వెళ్లాల్సి వచ్చింది.

ఈ క్రమంలో డిజైరీ కోసం కాచుకుని కూర్చున్న మార్కో మళ్లీ ఆమె దగ్గరికి వెళ్లాడు. అయితే ఈసారి కూడా డిజైరీ అతడిని గట్టిగా తోసివేసి.. కారు డోర్‌ వేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మార్కో.. ఆమె చేతిలో చిన్నారిపై కాల్పులకు తెగబడ్డాడు. అద్దం పగలడంతో రెండు బుల్లెట్లు చిన్నారి తలలోకి దుసుకుపోయాయి. ఈ క్రమంలో జరుగబోయే ప్రమాదాన్ని ఊహించిన డిజైరీ స్నేహితురాలు వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మార్కోను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సహాయంతో డిజైరీ తన బిడ్డను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డిజైరీ, ఆమె భర్తతో పాటు.. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరు చిన్నారి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ విషయం గురించి ఫ్రెస్నో పోలీస్‌ చీఫ్‌ జెర్రీ డయర్‌ మాట్లాడుతూ..‘ ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తితో మార్కో ఇలా ప్రవర్తించాడు. తన క్రూర వాంఛ తీర్చుకోకుండా డిజైరీ అడ్డుకున్నందుకు ప్రతిగా..ఆమె బిడ్డపై కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు తన ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. నిజానికి మార్కో ఇలా చేయడం మొదటిసారేం కాదు. గతంలో కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌ దూరంగా పెట్టినందుకు ఆమె ఇంట్లో చొరబడి ఏడాది వయస్సున్న చిన్నారిపై కాల్పులు జరిపాడు. ఇలాంటివి అతడిపై తొమ్మిది కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మార్కోను అదుపులోకి తీసుకున్నాం. అయితే అతడి ముఖంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. మనిషి ప్రాణం అంటే అతడికి విలువ లేదు. మార్కో కారణంగా డిజైరీ లాంటి ఎంతోమంది ఆడపిల్లలు ఎంతో క్షోభ అనుభవించి ఉంటారు. అతడిపై గృహ హింస కేసు కూడా నమోదైంది. ఇంట్లో వాళ్లను కూడా అతడు వేధిస్తున్నాడు’ అని మార్కో వ్యక్తిత్వం గురించి వెల్లడించారు. కాగా గతంలోలాగే ఈ కేసులో కూడా అతడు బెయిలుపై బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రపంచంలోని దాదాపు చాలా దేశాల్లో ఇలాంటి సైకోలకు సరైన శిక్ష విధించే అవకాశం ఉన్నా చట్టాల అమలులో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు