అంతా దెయ్యం పనే!!

3 Dec, 2019 19:26 IST|Sakshi

అంతుచిక్కని రోగం బాధపడుతున్న మహిళ

సాక్షి, విజయవాడ: ఆమెకు అంతుచిక్కని రోగం. తీవ్రమైన మనోవేదన. అయితే వ్యాధికి తగ్గ చికిత్స అందడం లేదు.  పైగా ఇదంతా దెయ్యం పనే అని నమ్ముతోంది. మంత్రగాళ్ళ చుట్టు తిరుగుతోంది. ఇంటర్‌ నెట్‌ కాలంలోనూ మూఢనమ్మకాలను గట్టిగా నమ్మతోంది విజయవాడలోని ఓ కుటుంబం.

ఈ దంపతుల పేర్లు దాడి లక్ష్మీ, దాడి రమణ. విజయవాడ కృష్ణ లంక రాణిగారి తోటలో నివాసం. కూరగాయల వ్యాపారం చేస్తూ కాలం గడుపుతున్నారు. అయితే ఈ మధ్య లక్ష్మి మనో వేదనతో బాధ పడుతున్నారు. అదేమిటంటే దెయ్యంగాలి  వెంటాడుతోందని ఆమె చెబుతున్నారు. ఎవరిని చూసినా ఓ రకంగా భయపడుతున్నారు. దెయ్యాలు భూతాలు లేవని ఆమెకు భర్తాపిల్లలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా లక్ష్మిలో మార్పు రాలేదు. దీంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఆమెకు నయం కావాలంటే దేవతార్చన ఒక్కటే మార్గమని చుట్టుపక్కల వారు చెప్పడంతో అందుబాటులో వున్న ఆలయాలన్నింటికీ తిరిగారు. ఈ క్రమంలో కృష్ణా ఘాట్‌లో కాలుజారి పడిపోవడంతో అక్కడే ఉన్న పోలీసు రక్షించారు. తాను ప్రమాదానికి గురికావడం కూడా  దెయ్యంపనే అంటున్నారు లక్ష్మి.    

లక్ష్మి కొన్నాళ్ళుగా భయపడుతున్నారని భర్త రమణ చెప్తున్నాడు. గాలిసోకిందన్న అనుమానం ఆమెను వెంటాడుతోందని వాపోయాడు. ఆ కారణంగా తన భార్య చాలా ఇబ్బందులు పడుతోందని చెప్పాడు. వైద్యంతో పాటు మంత్రగాళ్ళను ఆశ్రయించామని తెలిపాడు. దెయ్యాలంటే భయం లేదంటున్న ఇరుగుపోరుగు వారు, లక్ష్మి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21వ శతాబ్ధంలో మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న ఈ కుటుంబాల్లో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఎంతైనా వుంది.
 

మరిన్ని వార్తలు