కడతేర్చిన కలహాలు

7 Jun, 2018 08:17 IST|Sakshi
ఇందిర (ఫైల్‌), బద్రినాథ్‌(ఫైల్‌)

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) / అగనంపూడి(గాజువాక) : తాళి కట్టినప్పటి నుంచీ భర్త నుంచి వేధింపులే. కుటుంబ పోషణకు చాలీచాలని డబ్బులు ఇవ్వడం... గట్టిగా అడిగితే కొట్టడం... ఈ వేధింపులు ఏడేళ్లుగా భరించిన ఆ మాతృమూర్తి ఇక తనవల్ల కాదంటూ బలవంతంగా తనువు చాలించింది. తను లేని లోకంలో బిడ్డలు ఏమైపోతారో అన్న బాధతో వారినీ వెంట తీసుకెళ్లిపోవాలనుకుంది. ఈ క్రమంలో కుమారుడు అమ్మ వెంటే అందని లోకాలకు వెళ్లిపోగా... గాయాలతో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ హృదయ విదారకర దుర్ఘటన యల్లపువానిపాలెం – దువ్వాడ మధ్యలో రైల్వే ట్రాక్‌పై బుధవారం సంభవించింది. భార్యాభర్తల మధ్య కలహాలు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సమీప పరసపాడుకు చెందిన ఇందిరకు పార్వతీపురం సమీపంలోని వెంకంపేటకు చెందిన కోరంగి చంద్రశేఖర్‌తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. అనంతరం వీరు బతుకుదెరువు కోసం విశాఖ శివారు వడ్లపూడి కణితి నిర్వాసిత కాలనీకి వలస వచ్చారు. భర్త ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఇందిర టైలరింగ్‌ పనిచేస్తూ చేదోడుగా ఉండేది. అయినప్పటికీ భార్యను చంద్రశేఖర్‌ నిత్యం వేధిస్తుండేవాడు. కుటుంబ పోషణకు కూడా సరిపడా డబ్బులు ఇచ్చేవాడుకాదు. దీంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కుటుంబ పెద్దలు సర్ది చెబుతుండేవారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట కూడా భార్యను చంద్రశేఖర్‌ తీవ్రంగా కొట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇందిర తండ్రి శ్రీనివాసరావు వచ్చి అల్లుడిని మందలించి వెళ్లిపోయాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోగా బుధవారం మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇందిర తన ఆరేళ్ల కుమార్తె జ్యోత్స్న, నాలుగేళ్ల కుమారుడు బద్రినాథ్‌ను తీసుకుని బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రానికి తల్లీ కుమారుడు విగతజీవులుగా మారారు. 

తల్లీ తమ్ముడి మృతదేహాల వద్ద ఏడుస్తూ... 
బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చేపల వేట ముగించుకుని వస్తున్న మత్స్యకారులు యల్లపువానిపాలెం – దువ్వాడ మధ్య పొలంబొట్టపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌ పక్కన కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టులైపోయారు. తల్లి, తమ్ముడి మృతదేహాల పక్కన చిన్నారి వెక్కివెక్కి ఏడుస్తుండడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని గోపాలపట్నం పోలీసులకు సమాచారం అంచారు. సీఐ పైడియ్యతో పాటు ఎస్‌ఐ తమ్మినాయుడు సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలిలో లభించిన ఫోన్‌ ఆధారంగా మృతుల వివరాలు తెలుసుకున్నారు. చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులు వడ్లపూడి వాసులుగా గుర్తించి దువ్వాడ రైల్వే పోలీసులకు, వడ్లపూడి పోలీస్‌ స్టేషన్‌కూ సమాచారం అందించారు. అయితే అప్పటికే తన భార్య కనిపించడం లేదని చంద్రశేఖర్‌ వడ్లపూడి పోలీసులను ఆశ్రయించడంతో విషయం తెలియజేసి గోపాలపట్నం రప్పించారు. చంద్రశేఖర్‌ను ఏసీపీ అర్జున్, సీఐ పైడియ్య, ఎస్‌ఐ తమ్మినాయుడు విచారించారు. సంఘటన ఎలా జరిగిందో తెలియదని, బుధవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం 11 గంటల నుంచి కనిపించలేదని చెప్పాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు