కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు

25 Jan, 2018 07:33 IST|Sakshi
మృతిచెందిన శేషమ్మ

డబ్బుల కోసం వేధింపులు

జీవితంపై విరక్తి చెంది మహిళ ఆత్మహత్య

మదనపల్లె క్రైం : ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న డబ్బు చెల్లించాలన్న మేస్త్రీ వేధింపులు తాళలేక భవన నిర్మాణ కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు.. మొరవ భీమగానిపల్లెకు చెందిన శ్రీనివాసులు, శేషమ్మ(45) దంపతులు స్థానికంగా భవన నిర్మాణాల ఒప్పందపు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం అదే ఊరికి చెందిన మేస్త్రీ పాపిరెడ్డి వద్ద పుంగనూరులో ఓ భవన నిర్మాణం కోసం కొంత నగదు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఆ ఇంటిని సకాలంలో పూర్తి చేయలేకపోయారు. డబ్బు చెల్లించా లని మేస్త్రీ ఒత్తిడి చేశాడు. కర్ణాటకలో కూలి పనులు చేసి డబ్బు చెల్లించాలని శ్రీనివాసులు ఆరు నెలల క్రితం వెళ్లాడు.

అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి వెళుతున్నాడు. దీంతో ఆగ్రహించిన మేస్త్రీ బాకీ తీర్చకుండా బయటకు వెళ్లరాదని పేర్కొంటూ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తన భర్తతో సంబంధం లేకుండా తాను డబ్బు చెల్లిస్తానని శేషమ్మ మేస్త్రీ కాళ్లు పట్టుకుని వేడుకుంది. అయినా అతను ప్రతి రోజూ డబ్బు కోసం వేధిస్తుండడంతో మంగళవారం రాత్రి ఆమె పురుగుల మందుతాగింది. స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం శేషమ్మ మృతిచెందింది. మృతురాలికి మేఘశ్రీ, నాగలక్ష్మి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు