అనుమానంతో మహిళ హత్య

18 Nov, 2019 07:47 IST|Sakshi
కళావతి మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త ఎర్రన్న, బంధువులు

నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన హతురాలి బంధువులు

బోరిగాం గ్రామంలో  ఉద్రిక్తత

హత్య వివరాలు వెల్లడించిన డీఎస్పీ

సారంగపూర్‌(ఆదిలాబాద్‌ ) : మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన ఎడ్ల కళావతి(42)ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గోనే సంచిలో కట్టి నిర్మల్‌ రూరల్‌ మండలం తల్వేద గ్రామంలోని చెరువులో పడేసిన ఘటన విధితమే. అయితే ఈ ఘటనపై ఆదివారం మృతురాలి బంధువులు బోరిగాం గ్రామంలో ఆందోళనకు దిగారు. అనవసరంగా అనుమానం పెంచుకుని మహిళా అని కూడా ఆలోచించకుండా కిరాతకంగా హత్య చేశారని ఆరోపిస్తూ నిందితుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు సైతం నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ సారంగాపూర్‌ ఎస్సై యూనుస్‌ అహ్మద్‌ అలీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో నిర్మల్‌ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి బోరిగాం గ్రామానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు. అలాగే కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అనుమానంతో..
బోరిగాం గ్రామానికి చెందిన అచ్చమ్మ–రాజన్న దంపతులకు ముగ్గురు కుమారులు ప్రసాద్, నరేష్, రమేష్‌లు, కుమార్తె రాధ ఉన్నారు. చిన్నవాడైన ప్రసాద్‌కు ఆర్మీ జవానుగా ఉద్యోగం చేసేవాడు. సెలవులో ఇంటికి వచ్చిన ప్రసాద్‌ నాలుగు నెలల క్రితం ఇంటి పక్కన గల ఎడ్ల కళావతి–ఎర్రన్నల కుమారుడు మహేందర్, మరో స్నేహితుడు నిఖిల్‌లతో కలిసి దావత్‌కు వెళ్లాడు. దావత్‌ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆలూరు మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రసాద్‌ మరణించాడు. అయితే ప్రసాద్‌ తల్లి, సోదరులు ఇది రోడ్డు ప్రమాదం కాదని కావాలనే మహేందర్, నిఖిల్‌లు చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని అనుమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు మహేందర్, నిఖిల్‌ కుటుంబీకులను నరేష్, రమేష్‌లు బెదిరించారని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ వేధింపులు భరించలేక ఇంటిని ఖాళీ చేసి ఎడ్ల కళావతి కుటుంబం గ్రామంలో మరో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 

హత్య జరిగింది ఇలా..
మృతురాలు ఎడ్ల కళావతి భర్త ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. కుమారుడు మహేందర్‌ బెదిరింపుల నేపథ్యంలో గ్రామాన్ని వదిలి నిర్మల్‌ మండలం మంజులాపూర్‌లో ఉంటున్నాడు. మృతురాలు కళావతి ఈ నెల 12వ తేదీన గ్రామంలో ఒకరి ఇంటి వద్ద భజన కార్యక్రమాన్ని హాజరవడానికి అచ్చమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా గమనించిన నరేష్, రమేష్, అచ్చమ్మ, పక్కా ప్రణాళిక ప్రకారం కళావతిని ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మేడపైనున్న మరో గదిలోకి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి తల్వేద గ్రామంలోగల చెరువులో పడేశారు. పలువురికి కళావతి కేకలు, అరుపులు వినిపించడంతో విషయాన్ని కళావతి కుమారుడు మహేందర్‌కు ఫోన్‌ చేసి తెలిపారని సమాచారం. ఈ నెల 14న మహేందర్‌ తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై అనుమానితులను విచారించగా హత్య విషయం వెలుగు చూసింది. 

నిందితులను కఠినంగా శిక్షించాలి
కేవలం అనుమానంతో కళావతిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు నరేష్, రమేష్, తల్లి అచ్చమ్మ, అక్క రాధ, బావ ముత్యంలను కఠినంగా శిక్షించాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఎస్సైని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్‌
బోరిగాం ఘటన నేపథ్యంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సారంగాపూర్‌ ఎస్సై యూనుస్‌ అహ్మద్‌ అలీని నిర్మల్‌ టౌన్‌ పోలీస్టేషన్‌కు అటాచ్‌ చేశామని రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే ప్రస్తుతం సారంగాపూర్‌ ఎస్సైగా టౌన్‌ ఎస్సై అరాఫత్‌కు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు