స్నేహితురాలి ఇంటికే కన్నం

29 Jan, 2018 09:08 IST|Sakshi
నిందితురాలితో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది

చోరీ కేసులో మహిళ అరెస్ట్‌

13 తులాల బంగారు స్వాధీనం

ప్రొద్దుటూరు క్రైం : సుజాత తరచూ విజయలక్ష్మి ఇంటి వద్దకు వస్తుండటంతో.. వారి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే స్నేహ ధర్మాన్ని మరిచిన సుజాత తన స్నేహితురాలు ఇంట్లో లేనపుడు ఆమె ఇంటికే కన్నం వేసింది. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా.. చివరికి కటకటాల పాలైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రామేశ్వరం వీధికి చెందిన వద్ది విజయలక్ష్మి ఈ నెల 22న ఇంటికి తాళం వేసి తాడిపత్రికి వెళ్లారు. తిరిగి 25న ఇంటికి రాగా ఎవరో తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 13 తులాల బంగారు నగలను దోచుకొని వెళ్లారు. ఈ మేరకు ఆమె అదే రోజు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఐ వెంకటశివారెడ్డి బాధితురాలితోపాటు వీధిలో విచారణ చేశారు. అదే వీధికి చెందిన తుడిమలదిన్నె సుజాత ఆమెతో చనువుగా ఉంటూ ఇంటి వద్దకు వచ్చి వెళ్లేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సుజాతను సీఐ విచారణ చేయగా.. చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయలక్ష్మి ఇంట్లో ఉన్న రెండు తాళం చెవిలలో ఒకటి తీసుకొని తన వద్ద ఉంచుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. నిందితురాలి వద్ద ఉన్న 13 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను రిమాండుకు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ వెంకటశివారెడ్డి, ఎస్‌ఐ చిన్నపెద్దయ్య, కానిస్టేబుల్‌ ఇజ్రాయేల్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు