మాయమాటలతో కలిసిపోతుంది.. కొట్టేస్తుంది

15 Aug, 2018 10:23 IST|Sakshi
నిందితురాలు, స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

తిరుపతిలో ఘరానా మహిళా దొంగ అరెస్టు

తిరుపతి క్రైం: నగరంలో ఆటో, బస్సుల్లో ప్రయాణికులతో కలసిపోయి మాయమాటలతో హ్యాండ్‌బ్యాగ్‌లు, బంగారు ఆభరణాల చోరీకి పాల్పడే ఘరానా మహిళా దొంగను క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అట్టీయాంపట్టికి చెందిన రేవతి (34), ముత్తమ్మ, సెల్వి, లక్ష్మిలతో కలసి ముఠాగా ఏర్పడింది. వీరు తిరుపతిలో బస్సులు, ఆటోల్లో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేసే వారు.

ఈ క్రమంలోనే దొంగిలించిన నగలను తిరుపతిలో అమ్ముకునేందుకు పథకం పన్నారు. మిగిలిన సభ్యుల కోసం ప్రధాన నిందితురాలు రేవతి తిరుపతి ఆర్టీసీ బస్టాండు వద్ద వేచి ఉండగా క్రైం సీఐ భాస్కర్‌రెడ్డి అరెస్టు చేశారు. 228 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.84 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాపై తిరుపతి క్రైం పోలీసు స్టేషన్‌ పరిధిలో 3 కేసులు, ఈస్టు పీఎస్‌ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. భారతిని చాక చక్యంగా అరెస్టు చేసిన సీఐ శరత్‌చంద్ర, పద్మలత, ఎస్‌ఐ రమేష్‌బాబులకు మనీ రివార్డులు వచ్చేలా ఎస్పీకి సిఫార్సు చేస్తామని డీఎస్పీ చెప్పారు.

మరిన్ని వార్తలు