కొండవీడు కొండపై మహిళ దారుణ హత్య 

10 Nov, 2019 12:01 IST|Sakshi

సాక్షి, గుంటూరు : వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యడ్లపాడు మండలం కోట గ్రామంలోని కొండవీడు కొండలపై నాలుగు రోజుల కిందట పాత గుంటూరుకు చెందిన గూడపాటి ఆదిలక్ష్మి (32) హత్యకు గురైనట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట సీఐ ఎం. సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై ఎ.నాగేశ్వరరావు శనివారం కోట గ్రామాన్ని సిబ్బందితో చేరుకున్నారు.

గ్రామస్తుల సహకారంతో కొండ ప్రాంతంలోని హత్య జరిగిన ప్రదేశం ఆచూకీని కనుగొన్నారు. మృతురాలి సోదరుడు ఆదినారాయణ, మామయ్యను ఘటనా స్థలం వద్దకు పిలిపించి వివరాలు సేకరించారు. తన సోదరి మృతిపై ఆమెతో పాటు పనిచేసే ఓ వ్యక్తిపై అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు నుంచి క్లూస్‌టీం రప్పించి ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.

శవ పంచనామ కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.నాంచారయ్య, వీఆర్వో వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం గ్రామస్తుల సాయంతో బండరాళ్ల మధ్య చిక్కి శల్యమై ముఖంపై పురుగులు పట్టి దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహాన్ని డోలీ మాదిరిగా కర్రలకు కట్టి  పొదల మధ్య నుంచి మెట్ల మీదుగా కొండ కిందకు పోలీసులు తీసుకొచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

భర్త నుంచి విడిపోయి....
పాత గుంటూరుకు చెందిన ఆదిలక్ష్మికి 15 ఏళ్ల కిందట వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహమైంది. ఇద్దరు సంతానం కలిగాక దంపతులిద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నారు. స్థానికంగా సత్యనారాయణ దేవాలయం సమీపంలోని మూడో అడ్డరోడ్డు వద్ద నివాసం ఉంటున్న తల్లివద్దనే ఆదిలక్ష్మి తన ఇద్దరి పిల్లలతో ఉంటుంది.  స్టీల్‌ సామాన్లు విక్రయించే దుకాణంలో మూడు నెలలుగా పనిచేసుకుంటూ జీవిస్తోంది. అదే దుకాణంలో పనిచేసే పరుచూరి సునీల్‌కుమార్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. ఆదిలక్ష్మి హత్య కేసులో సునీల్‌కుమార్‌ పాత్రపై పోలీసులు విచారించి వివరాలు వెల్లడించాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు