దారుణం: వివాహిత సజీవ దహనం

17 Nov, 2019 10:28 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సౌత్‌ ఏసీపీ రామాంజనేయరెడ్డి, ఇన్‌సెట్‌లో భర్త శ్రీనివాసరావు, పిల్లలతో సరోజిని (ఫైల్‌)

సాక్షి, గాజువాక: రాజీవ్‌నగర్‌ దరి యాతపాలెంలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి అనుమానం రాకుండా ఉండేందుకు తగులబెట్టారా.. మరేమైనా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. సంఘటన చోటు చేసుకున్న సమయంలో పిల్లలు పక్కింట్లో ఉండటంతో వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. దువ్వాడ పోలీసుల కథనం ప్రకారం.. మిందికి చెందిన తాటిశెట్టి శ్రీనివాసరావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నా డు. కూర్మన్నపాలేనికి చెందిన సరోజినిని 2012లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం రాజీవ్‌నగర్‌ దరియాతపాలెంలో నివాసముంటున్నారు. శ్రీనివాసరావు ఎప్పటి మాదిరిగానే శనివారం జనరల్‌ షిఫ్ట్‌ విధులకు వెళ్లాడు. తనపై ఎవరో దుప్పటి కప్పి పీక నులిమారంటూ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సరోజిని తన భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది.

వెంటనే ఫోన్‌ కట్‌ అవడంతో అతడు తిరిగి ఫోన్‌ చేశాడు. ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో డ్యూటీలో పర్మిషన్‌ పెట్టుకుని హడావుడిగా వచ్చాడు. అప్పటికే ఇంటి బెడ్‌రూమ్‌లో మంటలు వ్యాపించి ఉన్నాయి. దీన్ని గమనించిన స్థానికులు అటు పోలీసులకు, ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే గది మొత్తం దగ్ధమైంది. ఆ మంటల్లో సరోజని పూర్తిగా కాలి బూడిదైంది. ఆనవాళ్లు కూడా దొరకనంతగా కాలిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో బంగారం కోసం ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా.. అనే కోణంలో వివరాలు సే కరిస్తున్నారు. ఆమెను హత్య చేసి అనుమానం రాకుండా తగులబెట్టారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనం పెట్రోలు పైప్‌ లాగేసి ఉండటంతో ఈ అనుమానానికి బలం చేకూర్చుతోంది. ఇంట్లో బంగారం కనిపించడం లేదు. అయి తే మంటల వేడికి బంగారం కరిగిపోయిందా, లేదా బంగారం కోసమే ఈ హత్య జరిగిందా అన్న వివరాలను సేకరిస్తున్నారు.

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ సైతం భద్రంగా ఉండటంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న సౌత్‌ ఏసీపీ రామాంజనేయరెడ్డి, దువ్వాడ సీఐ టి.లక్ష్మి ఘటనా స్థలానికి చేరుకు ని విచారణ చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్‌ తన విచార ణ కొనసాగించింది. క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలను సేకరించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌ సీపీ నాయకులు దామా సుబ్బారావు ఆచార్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.    

మరిన్ని వార్తలు