రా‘బంధువు’!

27 Jul, 2019 09:44 IST|Sakshi
నిందితులు సూర్య, శ్రీ వంశి, ఖుష్బూ

సమీప బంధువు ఆభరణాలపై మహిళ కన్ను

మరో ఇద్దరు పరిచయస్తులతో కలిసి ముఠా

తన తండ్రికి ఇచ్చే మత్తు మందు వాడి చోరీ

ముగ్గురు నిందితుల అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఆమె రా‘బంధువు’గా మారింది... సమీప బంధువు ఆభరణాలపై కన్నేసి అత్యంత తెలివిగా చోరీ చేయించింది... ఇందుకుగాను తన తండ్రికి వినియోగించే మత్తు మాత్రలు వినియోగించి. ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే నల్లకుంట పోలీసులు ఈ కేసు ఛేదించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఈ దర్యాప్తులో నల్లకుంట అదనపు ఇన్‌స్పెక్టర్‌ సైదులు పాత్ర కీలకమన్నారు. ఈస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ గోవింద్‌రెడ్డి, కాచిగూడ ఏసీపీ ఎస్‌.సుధాకర్, నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌లతో కలిసి శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాంనగర్‌ గుండు, గణేష్‌నగర్‌కు చెందిన పిల్లా వినయకుమారి రాష్ట్ర పోలీసు అకాడెమీలో టెలిఫోన్‌ ఆపరేటర్‌ ఇన్‌చార్జ్‌గా పని చేస్తోంది. కొన్నాళ్ల క్రితమే భర్త మరణించడంతో తన కుమార్తెతో కలిసి ఉంటోంది. బేగంపేటలోని ఆర్బీఐ క్వార్టర్స్‌లో ఉంటున్న వీరి సమీప బంధువైన ఖుష్భూనాయుడు భర్త రిజర్వ్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. బ్యాంకు రుణం పొందటంలో సహాయం చేయాల్సిందిగా కోరుతూ పుప్పాలగూడకు చెందిన సూర్యకృష్ణ అతడి వద్దకు వచ్చివెళ్లే వాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఖుష్భూతో పరిచయం ఏర్పడి ఇద్దరూ సన్నిహితంగా మారారు. ఇదిలా ఉండగా ఖుబ్బూ తండ్రికి గత ఏడాది గుండె ఆపరేషన్‌ జరగడం, ఇటీవల ఆమె సోదరుడికి పక్షవాతం రావడంతో వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాయి. వారికి సహాయం చేస్తూ ఈమె సైతం అప్పుల్లో కూరుకుపోయింది. సూర్యకృష్ణ తండ్రి సైతం ఇటీవల అనారోగ్యానికి లోను కావడంతో అతనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఫంక్షన్‌లో నగలు చూసి...
ఇదిలా ఉండగా తరచూ వినయకుమారి ఇంటికి వెళ్లి వస్తుండే ఖుష్భు ఇటీవల ఓ ఫంక్షన్‌కు కుమారి ఒంటి నిండా నగలు ధరించి రావడంతో ఖుష్భూ కళ్లు వాటిపై పడ్డాయి. తరచూ సూర్యకృష్ణ రూమ్‌కు వెళ్లే ఖుష్భూ నగల విషయం అతడికి చెప్పి వాటిని చోరీ చేద్దామని సలహా ఇచ్చింది. ఆ సమయంలో గదిలో సూర్యకృష్ణ స్నేహితుడైన వంశీ కూడా ఉండటంతో అతడూ ఆసక్తి చూపించి వీరితో జత కలిశాడు. ఇందుకు పక్కా పథకం వేసిన ఖుష్భూ అదను చూసుకుని వినయకుమారి ఇంటి, ఆల్మారా, బీరువా తాళాలను చేజిక్కించుకుంది. వీటిని సూర్య, వంశీలకు ఇచ్చి నకిలీవి తయారు చేయించింది. అనంతరం ఇల్లు, బీరువా, అల్మారాలను వీడియో తీసి వాట్సాప్‌ ద్వారా సూర్యకు పంపింది. ఈ నెల 19 రాత్రి చోరీకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఖుష్భూ తన తండ్రికి అవసరమైన నిద్రమాత్రలను తరచు సూర్య ద్వారా తెప్పించేది. గత ఏడాది అక్టోబర్‌లో కొన్న కొన్ని మాత్రలను అతడు తన వద్దే ఉం చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఖుష్భూ వాటిని అతడినుంచి తీసుకుంది.

నిమ్మ రసంలో మత్తుమందు కలిపి..
19న వినయకుమారి ఇంటికి వెళ్లిన ఆమె నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి తల్లీకూతుళ్లకు ఇచ్చి తాగించింది. వీటి ప్రభావంతో వినయకుమారి, ఆమె కుమార్తె అస్వస్థతకు గురయ్యారు. దీంతో అంబులెన్స్‌ పిలిచిన ఖుష్భూ వారిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించింది. వినయకుమారిని ఐసీయూలో చేర్చగా, ఆమె కుమార్తె సాధారణ పేషెంట్‌గా చికిత్స పొంది. అప్పటికే వారి ఇంటి తాళాలు తన దగ్గరే ఉంచుకున్న ఖుష్భూ ఈ విషయం ఫోన్‌ ద్వారా సూర్యకు చెప్పడంతో అతను వంశీతో కలిసి వినయకుమారి ఇంటికి వెళ్లాడు. తమ వద్ద ఉన్న మారు తాళాలతో మెయిన్‌ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆస్పత్రికి వెళ్లిన వారు అసలు తాళాలు తీసుకువచ్చి ప్రధాన ద్వారం తెరిచారు. అనంతరం మారు తాళాలతో బీరువా, అల్మారా ఓపెన్‌ చేసి అందులో ఉన్న 53.87 తులాల బంగారం, రూ.5.25 లక్షల నగదు చోరీ చేశారు. వెళ్తూ అన్ని తాళాలు యథావిధిగా వేసి అసలువి ఖుష్భూకు ఇచ్చేశారు. 23 వరకు వినయకుమారి చికిత్స పొందటంతో ఆమె కుమార్తె సైతం ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఖుష్భూ తరచూ ఆస్పత్రికి వచ్చి వెళ్లేది. మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వినయకుమారి కుమార్తెతో కలిసి ఇంటికి వెళ్లింది. సొత్తు పోయిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.

ఆధారాలు తుడిచేశారు..
నల్లకుంట అదనపు ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలిని సందర్శించారు. అక్కడి పరిస్థితుల ఆధారంగా తొలుత అసలు నేరం జరగలేదని భావించారు. ఆపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సైదులు ఆ చోరీ ఇంటి దొంగల పనిగా తేల్చారు. ఆ రోజు వినయకుమారి ఇంట్లో ఉన్న వారు ఎవరు? వారు ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారు? అనే అంశాలపై ఆరా తీయగా ఖుష్భూ ప్రధాన అనుమానితురాలిగా మారింది. బుధవారం ఠాణాకు పిలిపించి విచారించగా నేరం అంగీకరించిన ఆమె తనతో  సూర్య, వంశీల పాత్ర బయటపెట్టింది. దీంతో ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో సర్జికల్‌ గ్లౌజులు వేసుకుని నేరం చేసిన సూర్య, వంశీ, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ఇంట్లో వారు  తాకిన ప్రాంతాలను నీళ్లతో కడగటం గమనార్హం.   

>
మరిన్ని వార్తలు