మహిళ దారుణ హత్య

9 Feb, 2019 07:56 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీస్‌అధికారులు సీసీ కెమెరాలో రికార్డు అయిన  బానాల రమణ, చిన్నా కదలికలు

కరీంనగర్‌–చొప్పదండి ప్రధాన రహదారిపై ఘటన

సిమెంట్‌ ఇటుకతో మోది చంపిన హంతకుడు

రైల్వేస్టేషన్‌లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు

హత్య జరిగిన ప్రాంతంలో కనిపించని సీసీ కెమెరాలు

భర్తపైనే అనుమానం∙దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కరీంనగర్‌ క్రైం: నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం, అపోలో ఆస్పత్రికి కూతవేటు దూరం, చొప్పదండి– కరీంనగర్‌ ప్రధాన రహదారిపై బానాల రమణ(25)ను సిమెంట్‌ ఇటుకతో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రధాన రహదారిపైనే మహిళను హత్య చేయడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

దారుణంగా హత్య..
నగరంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి కూత వేటు దూరంలో కరీంనగర్‌–చొప్పదండి ప్రధాన రహదారి పక్కన సయ్యద్‌ యూసుఫ్‌ పండ్ల దుకాణం ఏర్పాటు చేసేందుకు మూడు రోజులుగా తడుకల షెడ్డు పనులు చేస్తున్నారు. షెడ్డులో ఓ మహిళ(25)ను దారుణంగా హత్య చేశారని ఉదయం 7.30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బ్రౌన్‌ కలర్‌ చీర ధరించి ఉన్న మహిళ ముఖాన్ని సిమెంట్‌ ఇటుకతో మోదడం తల పగిలింది. సంఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఎక్కడా కనింపించలేదు. ఆమెపై అత్యాచారం జరగలేదని శరీరంలో ఎక్క డా ఎలాంటి గాయాలు లేవని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ ఉషారాణి ప్రకటించారు. క్లూస్‌ టీం పలు ఆ« దారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ హత్య జరిగిన సంఘటన నుంచి పక్కనే ఉన్న సరస్వతినగర్‌ వైపు కొంతదూరం వెళ్లి ఓ ఇంటి వద్ద నిలిచింది.

కొన్ని గంటల్లోనే గుర్తింపు..
హతురాలు ఎవరనేది గుర్తించేందుకు తాడికల్‌ హత్య కేసును విచారించిన బృందాన్ని ప్రత్యేకంగా దీని కోసం నియమించారు. వారు రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా అందులో మృతురాలు మరో వ్యక్తితో కలిసి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వాటిని కరీంనగర్‌ సైబర్‌ ల్యాబ్‌ సహకారంతో స్పష్టమైన చిత్రాలను తయారు చేసి మీడియా, సోషల్‌ మిడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో మృతురాలి, అనుమానితుడి వివరాలను పోలీసులు సేకరించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మృతురాలిని, అనుమానితుడిని గుర్తించారు.
 
చిన్నాపైనే అనుమానం..?
జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం కేంద్రానికి చెందిన బానాల రమణ(25) హైదారాబాద్‌లోని కరకంటి చిన్న (27) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.  కొద్ది రోజుల క్రితం వీరిని ఓ కేసులో గుంటూరు జైలుకు పంపారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరు కూడా రెండు రోజుల క్రితం గుంటూరు జైలు నుంచి విడుదల అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం వేకువజామున ఉదయం 2 నుంచి 4 గంటల మధ్య రమణ దారుణహత్యకు గురైంది. అమె వెంట ఉన్న చిన్నానే పథకం ప్రకారం హత్య చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు వచ్చిన సమయంలో రమణ వద్ద ఒక సంచి, మరో ప్లాస్టిక్‌ కవర్‌ ఉంది. సంఘటన స్థలంలో కవర్‌ లభించింది. సంచి లభించలేదు.

మూడు ప్రత్యేక బృందాలు  ఏర్పాటు..
హత్య సమాచారం అందుకున్న కరీంనగర్‌ అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్, రూరల్‌ ఏసీపీ ఉషారాణి, టాస్క్‌ఫొర్స్‌ ఏసీపీ శోభన్‌కుమార్, రూరల్‌ సీఐ శశిధర్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ కిరణ్‌కుమార్, క్లూస్‌ టీం ఇన్‌చార్జి శ్రీధర్, సైబర్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి మురళి, రూరల్‌ ఎస్సై చంద్రశేఖర్‌ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ ఉషారాణి, టాస్క్‌ఫొర్స్‌ ఏసీపీ శోభన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు