కేఏపాల్‌పై కేసు నమోదు

29 May, 2019 07:41 IST|Sakshi
కేఏ పాల్‌, బాధితురాలు సత్యవతి

అమెరికా పంపిస్తానని మోసం చేశాడని మహిళ ఫిర్యాదు  

పంజగుట్ట: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్‌ కేఏ పాల్‌ ఓ మహిళకు అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఇస్తానని నమ్మించి రూ. 2 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు పాల్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ సత్యవతి వ్యాపారం చేసేది. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నంలో ఉన్న ఆమెకు ఒంటరిగా ఉన్నందున నిబంధనల ప్రకారం వీసా తీసుకునేందుకు స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ అవసరం. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు కేఏ పాల్‌ను సంప్రదిస్తే స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఇస్తారని చెప్పడంతో ఆయన పీఏ విజయ్‌ని సంప్రదించారు.

విజయ్‌ ద్వారా గత నెల 22న పాల్‌ను కలిసి స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ కావాలని కోరగా, రూ. 15 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. రూ. 2 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ నెల 8న పాల్‌ అసిస్టెంట్‌ జ్యోతి పేరుతో రూ. 2 లక్షల చెక్కును అమీర్‌పేటలోని పాల్‌ కార్యాలయంలో అతడికి ఇచ్చింది. చెక్కును క్యాష్‌ చేసుకున్నప్పటికీ లెటర్‌ ఇవ్వాలని కోరినా స్పందన లేదని తెలిపింది. అంతేగాక తన ఫోన్‌ బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు పేర్కొంది. నేరుగా కార్యాలయానికి వెళ్లి అడగ్గా రూ. 2 లక్షలతో పని కాదని, మరో రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో బాధితురాలు మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేఏ పాల్, అతని పీఏ విజయ్, అసిస్టెంట్‌ జ్యోతిలపై కేసులు నమోదు చేశారు. పాల్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు