రూట్‌ నంబర్‌–300 బస్సులే టార్గెట్‌

18 Jul, 2019 09:37 IST|Sakshi

చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మహిళ రిమాండ్‌   

చాంద్రాయణగుట్ట: ‘300 రూట్‌’ నంబర్‌ ఆర్టీసీ బస్సులే లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న  మహిళను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. డీఎస్సై  కొండల్‌రావ్‌తో కలిసి ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్, శంకర్‌నగర్‌కు చెందిన బండి కీర్తి అలియాస్‌ దుర్గ (30) దొంగతనాలు వృత్తిగా మార్చుకుంది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే రూట్‌ నంబర్‌–300 (ఉప్పల్‌–మెహదీపట్నం) బస్సులను  ఎంచుకుని చోరీలకు పాల్పడేది. సాగర్‌ రింగ్‌ రోడ్డు, ఎలబీ నగర్‌ ప్రాంతాల్లో బస్సు ఎక్కే కీర్తి కాటేదాన్‌ వెళ్లేలోగా అదను చూసి ప్రయాణికుల నగలను చోరీ చేసేది. ఫుట్‌బోర్డుపై నిలుచుని బస్సుదిగే ప్రయత్నంలో ఉన్న ప్రయాణికుల గొలుసులు కొట్టేసి ముందు స్టాప్‌లో దిగిపోయేది.


వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ 
ఉదయం 8.30 నుంచి 11 గంటలు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య మాత్రమే ఈమె పంజావిసిరేది. బుధవారం ఉదయం హఫీజ్‌బాబానగర్‌లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న డీఎస్సై కొండల్‌రావు, క్రైం కానిస్టేబుళ్లు ప్రశాంత్, నిఖిల్‌ సాయి, దినేశ్వర్‌లకు అనుమానాస్పదంగా కనిపించిన కీర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించింది. ఇదే తరహాలో ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట పరిధిలో మూడు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 2012లో మేడిపల్లి ఠాణా పరిధిలో నమోదైన చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చింది. బస్సుల్లో నలుగురైదుగురు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నరని, ప్రస్తుతం ప్రధాన నిందితురాలు కీర్తి పట్టుబడినట్లు తెలిపారు. ఆమె నుంచి 4.8 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితురాలిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైం సిబ్బందికి  రివార్డు అందజేశారు. 

>
మరిన్ని వార్తలు