ఎంచక్కా.. కోటి కొట్టేసింది

2 Jun, 2020 10:57 IST|Sakshi

పెళ్లి పేరిట సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను బురిడీ కొట్టించిన యువతి

సాక్షి, హైదరాబాద్‌: మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయమైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పెళ్ళిచేసుకుంటానని నమ్మించిన ఓ యువతి అతని నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసి బురిడీ కొట్టించింది. దీంతో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. అనుపల్లవి మాగంటి పేరుతో వరుడు కావాలంటూ ఓ యువతి తెలుగు మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్‌ బల్టీమోర్‌ ప్రాంతంలో జన్మించినట్లుగా వివరాలను పొందుపర్చింది. తాను డాక్టర్‌ అని, తన తల్లిదండ్రులు కూడా డాక్టర్లేనని, తన నివాసం జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–71లో ఉందని పేర్కొంది. ఆ వివరాలను చూసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆమెతో పలుమార్లు చాటింగ్‌ చేశాడు.(ఫేక్‌ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల)

ఈ సందర్భంగా ఆమె.. తన తండ్రి  చనిపోయారని, ఆస్తులను తన పేరిట రాశారని చెప్పుకొచ్చింది. తన పెళ్లి విషయంలో వివాదం నెలకొందని, డబ్బున్న బిజినెస్‌మేన్‌ కొడుకును వివాహం చేసుకోవాలని ఒత్తిళ్లు ఉన్నాయని నమ్మబలికింది. తనకు మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని పేర్కొంది. అయితే తన పేరిట ఉన్న ఆస్తులను న్యాయపరంగా దక్కించుకునేందుకు కొంత డబ్బు అవసరముందని, ఇందుకు సహాయం చేయాలని కోరింది. మాయ మాటలు నమ్మిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పలుమార్లు కోటి రెండు లక్షలా 18 వేల 33 రూపాయలను ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా యువతి సూచించిన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అనంతరం ఆమె మొహం చాటేయడంతో తాను ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేసిన యువతి మాళవిక దేవతిగా గుర్తించడంతో పాటు తాను మోసపోయినట్లుగా భావించి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ()

ఈమె.. ఆమేనా..
మాళవిక దేవతి పేరుతో గతంలోనూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను బురిడీ కొట్టించిన కేసు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైంది. ఓ ఎన్‌ఆర్‌ఐతో రూ.65 లక్షలు వసూలు చేసి మోసం చేసింది.  విషయం తెలుసుకున్న పోలీసులు రెండు కేసుల్లోనూ నిందితురాలు ఒక్కరేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు