రెట్టింపు ఆశ చూపి మోసం

10 Dec, 2018 11:21 IST|Sakshi
మోసపోయిన సవితా దంపతులు .మోసానికి పాల్పడ్డ నీతా

యువతిపై దంపతుల ఫిర్యాదు

కృష్ణరాజపురం : వ్యాపారాన్ని విస్తరించడానికి తనకు డబ్బులు అవసరం ఉందని కొద్ది రోజుల్లోనే ఇచ్చిన డబ్బుకు రెట్టింపు ఇస్తానంటూ ఓ మహిళ దంపతులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన ఆదివారం చెన్నమ్మనకెరె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. నీతా అనే మహిళ నగరంలోని మల్లేశ్వరం, చెన్నమ్మనకెరె, చామరాజపేట తదితర ప్రాంతాల్లో బ్యూటీ పార్లర్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం చెన్నమ్మనకెరె అచ్చుకట్టెకు చెందిన సవితా అనే మహిళతో పరిచయం పెంచుకున్న నీతా తాను మల్లేశ్వరంలో మరొక బ్యూటీపార్లర్‌ ప్రారంభిస్తున్నానని అందుకు తనకు కొంతమొత్తం డబ్బు అప్పుగా ఇవ్వాలంటూ కోరింది.

కొద్ది రోజుల్లోనే తీసుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ సవితాను నమ్మించి రూ.13 లక్షలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా తీసుకున్న డబ్బులు చెల్లించకపోగా ముఖం చాటేస్తూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఈఏడాది ఫిబ్రవరిలో నీతాను నిలదీయడంతో రూ.13 లక్షల చెక్కులు ఇచ్చింది. వాటిని బ్యాంకులో సమర్పించగా అవి చెల్లని చెక్కులుగా తేలడంతో మరోసారి నీతాను నిలదీసారు. అప్పటి నుంచి అదుగో ఇదుగో అంటూ మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తుండడంతో విసుగు చెందిన సవితా దంపతులు చెనమ్మనకెరె అచ్చుకట్టె పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నీతాపై కేసు నమోదు చేసుకున్న చెనమ్మనకెరె అచ్చుకట్టె పోలీసులు నీతా చేతిలో ఇంకా ఎంతమంది మోసపోయారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు