ఆచూకీ లేని మాయ‘లేడి'

9 Nov, 2019 10:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సాక్షాత్తూ రాష్ట్ర మాజీ గవర్నర్‌ నరసింహన్‌తో పాటుగా అప్పటి ఆంధ్రాయూనివర్సిటీ అధికారి ప్రొఫెసర్‌ ప్రసాదరావు సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో నిందితురాలు సత్యను అరెస్టు చేయడంలో మూడో పట్టణ పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆమె జాడ కూడా కనుక్కోలేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.  

ఆంధ్రాయూనివర్సిటీలో ఉద్యోగాల నియామక ఉత్తర్వులలో సంతకాలు ఫోర్జరీ చేసి మోసం చేశారని త్రీటౌన్‌ పోలీసులకు అక్టోబర్‌ 18వ తేదీన ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. మాజీ గవర్నర్, పూర్వ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి నియామక ఉత్వర్వులు జారీచేశారంటూ నిందితురాలు సత్యపై ఏయూ రిజి్రస్టార్‌ కృష్ణమోహన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

గొంతిన సత్య హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుమారుడు దినేశ్‌తో కలిసి నివసించేవారు. కాగా, తన తల్లి సత్య ఏయూలో ఉన్నత విద్య ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని ఎదురు ఫ్లాటులో ఉంటున్న రాజశేఖర్‌ని నమ్మించాడు. దీంతో రాజశేఖర్‌తోపాటుగా అతని బంధువులు, స్నేహితులు కలిపి 12 మంది రూ.1.7కోట్లు సమరి్పంచుకున్నారు. పెద్ద పోస్టులకు రూ.15 లక్షలు, చిన్న పోస్టులకు రూ.6లక్షలు వంతున వసూలు చేశారు. తరువాత ఏయూలో నియామకాలు వచ్చేశాయంటూ అప్పటి గవర్నర్‌ సంతకాలు ఫోర్జరీ చేసి ఉత్తర్వులు ఇచ్చేశారు.

ఈ ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఏయూ అధికారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు ఎస్‌ఐ స్థాయి అధికారి కాకుండా ఒక కానిస్టేబుల్‌ వెళ్లడం గమనార్హం. ఆయన సత్య నివసించిన ఫ్లాట్‌ వద్దకు వెళ్లగా సత్య, కుమారుడి ఆచూకీ లభించలేదు. వారు ఫ్లాట్‌ మాత్రం ఖాళీచేయలేదన్న సమాచారంతో మాత్రమే కొద్దిరోజుల క్రితం విశాఖ తిరిగిచేరుకున్నారు. కాగా ఈ కేసుపై త్రీటౌన్‌పోలీసులు పెద్దగా దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెలలోనే కొందరు బాధితులు త్రీటౌన్‌స్టేషన్‌కు వచ్చి తాము సత్య చేతిలో మోసపోయామని చెప్పగా..మోసం జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి అక్కడే ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు.

కాగా సత్య సుదీర్ఘకాలం సెలవులు తీసుకోవడంతో 2016 సంవత్సరంలో సస్పెండ్‌ అయ్యారు. సస్పెన్సన్‌లో ఉన్న మహిళ ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ డబ్బులు స్వాహా చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటివరకు సత్య ఆచూకీ తెలియకపోవడంతో ఏయూ అధికారులు సైతం కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా సత్య ఏయూలోని ఓ బ్యాంకులో పొదుపుఖాతా నిమిత్తం తన చిరునామాను పాండురంగాపురం, సెక్టార్‌–5, ఆరిలోవ అని తప్పుడు చిరునామా ఇచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ  కేసును త్రీటౌన్‌సీఐ కోరాడ రామారావు పర్యవేక్షణలో ఎస్‌ఐ ధర్మేంద్ర దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు