మూడేళ్ల కుమారుడితో బావిలో దూకిన మహిళ

24 Apr, 2018 13:06 IST|Sakshi
బావిలో ఉమాదేవి, జ్యోతీష్‌ మృతదేహాలు

బొండపల్లి(గజపతినగరం) : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు గాని.. ముక్కు పచ్చలారని మూడేళ్ల కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ముద్దూరు గ్రామానికి చెందిన మునకాల అప్పలనాయుడుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొరుగుపాలెంనకు చెందిన ఉమాదేవితో నాలుగు సంవత్సరాల కిందట వివాహం జరిగింది.

వీరికి జ్యోతీష్‌ (3) కుమారుడున్నారు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగినా, అప్పలనాయుడు మద్యానికి బానిస కావడంతో ఎప్పటికప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో వ్యసనం మానాలని భార్య ఉమాదేవి ఎప్పటికప్పుడు కోరేది.

అయితే అప్పలనాయుడు వ్యసనం మానకపోగా తిరిగి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యపై ఒత్తిడి తీసుకువచ్చేవాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం కూడా అప్పలనాయుడు తాగి రావడంతో భార్యాభర్తలత మధ్య గొడవ జరిగింది.

దీంతో మనస్తాపానికి గురైన ఉమాదేవి తల్లికి ఫోన్‌ చేసి వెంటనే వచ్చి తనను, కుమారుడ్ని తీసుకెళ్లాలని కోరింది. లేనిపక్షంలో నా శవం చూస్తారంటూ చెప్పింది. అయితే గొడవలు సహజమని, సర్దుకుపోవాలని ఉమాదేవి తల్లి సూచించింది.

తెల్లారేసరికి గ్రామ సమీపంలో ఉన్న బావిలో రెండు మృతదేహాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో అందరూ వెళ్లి చూడగా బావిలో ఉమాదేవి (25), జ్యోతీష్‌ (3) మృతదేహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను బయటకు తీశారు.

అదనపు కట్నం కోసం అల్లుడే తన కుమార్తెను చంపారని తల్లి కొండమ్మ, మేనమామ లండ రమణలు ఆరోపించారు. ఇదే విషయమై బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గజపతినగరం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కాళిదాసు, బొండపల్లి ఎస్సై ఎస్‌. సుదర్శన్, బొబ్బిలి డీఎస్పీ పి. సౌమ్యలత  గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం పీహెచ్‌సీకి తరలించారు. సీఐ పర్యవేక్షణలో ఎస్సై సుదర్శన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాలు తెలుసుకోండి..

తల్లీ, కుమారుడు మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్సై సుదర్శన్, సీఐ కాళిదాసులను డీఎస్పీ సౌమ్యలత ఆదేశించారు. మృతురాలి తల్లి,కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని డీఎస్పీ చెప్పారు. 

మరిన్ని వార్తలు