మద్యం తాగి భర్త వేధిస్తున్నాడు

28 May, 2019 11:42 IST|Sakshi
పోలీసు ప్రజాదర్బార్‌లో ఎస్పీకి సమస్య చెబుతున్న మహిళ

ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మిగనూరు మహిళ

కర్నూలు: ఎమ్మిగనూరు అగ్రికల్చర్‌ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న తన భర్త చాంద్‌బాషా ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి పిల్లలతో పాటు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కౌన్సిలింగ్‌ ఇచ్చి ఆయనలో మార్పు వచ్చే విధంగా చేయాలని ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పీరమ్మ ఎస్పీ ఫకీరప్పకు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాక్రమంలో ఎస్పీ ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 ఫిర్యాదులు వచ్చాయి. 

ప్రజాదర్బార్‌ ఫిర్యాదుల్లో కొన్ని..
జీవనాధారం కోసం తాము వలస వెళ్లినప్పుడు ఒక వ్యక్తి తమ పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని, ఇప్పుడు పొలానికి వెళ్తే అడ్డగిస్తున్నాడని కొత్తపల్లె మండలం లింగాపురం గ్రామానికి చెందిన గుల్లగుర్తి మునెయ్య ఫిర్యాదు చేశాడు. తమ వద్ద అన్ని ఆధారాలున్నప్పటికీ బెదిరిస్తున్నాడని, ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని మునెయ్య వేడుకున్నాడు.  
గడ్డివామి చుట్టూ ఉన్న సరిహద్దురాళ్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గూళ్యం గ్రామానికి చెందిన మారుతీ ఫిర్యాదు చేశారు.
పుట్టింటి వారు తమ ఆస్తి కోసం మమ్ములను కొట్టి తిట్టి కుమార్తెను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని రుద్రవరం మండలం పెద్ద కమ్మలూరు గ్రామానికి చెందిన రమణమ్మ ఫిర్యాదు చేశారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఆంజనేయులు, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, స్పెషల్‌బ్రాంచి సీఐ రామయ్యనాయుడు, ఎస్పీ పీఏ రంగస్వామి, ఆర్‌ఐలు రంగముని, జార్జి తదితరులు పాల్గొన్నారు.
వేమున ట్రావెల్స్‌ బస్సులకు డీజిల్‌ను అప్పుగా కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకుకు చెందిన మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు.
సహార ఇండియా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వారు కంతుల వారీగా డబ్బులు కట్టించుకొని మెచ్యూరిటీ అయినప్పటికీ తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు