మరో పోలీసు బలవన్మరణం

5 Feb, 2019 11:31 IST|Sakshi
సెంతమిళ్‌ సెల్వి

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

వేధింపులే కారణమా?

సాక్షి, చెన్నై: పోలీసు శాఖలో మళ్లీ ఆత్మహత్యల పర్వం మొదలైంది. తిరుచ్చి మహిళా జైలులో రెండో కేడర్‌ వార్డెన్‌గా ఉన్న మహిళా కానిస్టేబుల్‌ బలన్మరణానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారుల వేధింపులా, లేక ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.చెన్నైలో ఆదివారం మణికంఠన్‌ అనే యువ కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సంఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది. యువ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాల్లో కలవరాన్ని రేపింది. కడలూరు జిల్లా పెరియకాడు పాళయం గ్రామానికి చెందిన ముత్తు కుమార్తె సెంతమిళ్‌æ సెల్వి(23) తిరుచ్చి మహిళా జైలులో రెండో కేడర్‌ కానిస్టేబుల్‌ హోదాతో వార్డెన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి షిఫ్ట్‌కు సెంతమిళ్‌ సెల్వి విధులకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఎంతకూ రాలేదు. దీంతో సహచర సిబ్బంది ఆమె బసచేసిన క్వార్టర్స్‌కు వెళ్లి చూశారు. అక్కడ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సెంతమిళ్‌ సెల్వి వేలాడుతుండడంతో సహచరులు ఆందోళన చెందారు. జైలు ఉన్నతా«ధికారులకు సమాచారం అందించి తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తేల్చారు.

చిక్కిన లేఖ
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు,తిరుచ్చి పోలీసులు అర్ధరాత్రి సమయంలో సెంతమిళ్‌ సెల్వి గదిలో సోదాలు జరిపారు. అక్కడ ఓ లేఖ చిక్కింది. అందులో తన మరణానికి కారకులు ఎవరూ కారని, తానే ఈ నిర్ణయానికి వచ్చినట్టు రాసి ఉండడం అనుమానాలకు దారితీసింది. ఏదేని ప్రేమ వ్యవహారం కారణంగా ఉండవచ్చని తొలుత భావించారు. ఆమె సెల్‌ నంబర్‌ ఆధారంగా ఆ దిశగా విచారణను వేగంతం చేశారు. అయితే, జైలులో సాగుతున్న కొన్ని వ్యవహారాలు బయటకు పొక్కి ఉండడం, స్థానిక అధికారుల వేధింపుల్ని సెంతమిళ్‌ సెల్వి ఎదుర్కొంటున్నట్టు తేలడంతో ఆదిశగా విచారణ వేగవంతం అయింది. జైలులో న్యాప్‌కిన్స్‌ తయారు చేస్తున్నారు. ఇందులో కొన్ని జైలు ఖైదీల అవసరాలకు పోగా, మిగిలిన వాటిని బయటి మార్కెట్లో విక్రయిస్తారు. ఈ గుట్టు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం ఎలా ఉన్నతాధికారుల దృష్టికి చేరిందో, దీని వెనుక ఉన్న వాళ్ల ఎవరో ఆరాతీసే దిశగా సెంతమిళ్‌ సెల్వికి స్థానికంగా వేధింపులు పెరిగినట్టు సమాచారం. ఇది కూడా ఆమె బలవన్మరణానికి కారణంగా ఉండవచ్చన్న అనుమానాలతో విచారణ వేగాన్ని పెంచారు.  

మరిన్ని వార్తలు