గమ్యం చేరని ప్రయాణం

7 Jun, 2019 13:01 IST|Sakshi
ప్రమాదంలో మృతిచెందిన మహిళ భ్రమరాంబ

బస్సును ఢీకొన్న లారీ

మహిళ మృతి నలుగురికి గాయాలు

విశాఖపట్నం,నల్లజర్ల: నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. నల్లజర్ల ఎస్సై వి.సుబ్రహ్మణ్యం అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం డిపో బస్సు గురువారం విజయవాడ నుంచి ఏలేశ్వరం వెళుతుండగా పుల్లలపాడు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో వెనుక సీట్లో ఉన్న హైదరాబాదు నుంచి ఏలేశ్వరం వెళుతున్న తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం, కె.పెదపూడికి చెందిన చింతా విజయ భ్రమరాంబ (50)కు తీవ్రగాయాలయ్యయి. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న రెస్ట్‌  డ్రైవర్‌ నాగం సత్యనారాయణ (ఏలేశ్వరం) తీవ్రంగా గాయపడటంతో ఆయనను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీతానగరంకు చెందిన నేమాని సత్యవతి ఆమె కుమారుడు రామ్మోహనచౌదరి, మృతురాలు కుమారుడు పవన్‌కుమార్‌ కు స్వల్పగాయాలయ్యాయి. వీరందరికి నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

108 సిబ్బంది నిర్లక్ష్యం: తహసీల్దార్‌
బస్సు ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది వచ్చి ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదని తహసీల్దార్‌ గౌరినాయుడు ఆరోపించారు. ప్రమాద వార్త  తెలిసిన వెంటనే తాను సంఘటనా స్థలానికి వెళ్లానని, 108కు ఫోన్‌ చేస్తే సిబ్బంది డ్యూటీలు మారుతున్నామని చెప్పి ఆలస్యం చేశారని, ముందుగా వచ్చి ఉంటే ప్రయాణికురాలు భ్రమరాంబ బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కళ్లేదుటే ఆమె చనిపోయిందన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు