రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

31 Jul, 2018 13:05 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్‌లో) రాధిక(ఫైల్‌) 

శాయంపేట(భూపాలపల్లి) : స్పీడ్‌ బ్రేకర్, త్రిబుల్‌ రైడింగ్‌ ఓ మహిళ ప్రాణం తీసింది. స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బైక్‌ పైనుంచి ఓ మహిళ ఎగిరిపడగానే ఆమె తల మీదుగా వెనకాలే వస్తున్న టిప్పర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై జక్కుల రాజబాబు కథనం ప్రకారం... హన్మకొండలోని రాయపురకు చెందిన మంథుర్తి రాధిక(29), ఆమె భర్త శ్రీనివాస్, అత్త రాధమ్మ కలిసి రేగొండ మండలం తిర్మిలగిరి గ్రామానికి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు.

ఈ క్రమంలో మాందారిపేట స్టేజీ సమీపంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్ల వద్ద ద్విచక్రవాహనం ఎగరడంతో వెనకాల కూర్చున్న రాధమ్మ ముందుకు పడిపోయింది. దీంతో ఆమెను పట్టుకునే క్రమంలోనే రోడ్డుపై పడిపోయింది. వెనకాలే వస్తున్న టిప్పర్‌ వెనక టైరు రాధిక తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. పరకాల వైవీఎస్‌ సుధీంధ్ర, సీఐ షాదుల్లాబాబా, ఎస్సై జక్కుల రాజబాబు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు న్యాల కర్ణాకర్‌  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజబాబు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు