గృహప్రవేశానికి వెళ్లి వస్తూ ప్రమాదం

27 Apr, 2019 12:58 IST|Sakshi
సంఘటన స్థలంలో మృతి చెందిన చేకూరి సరస్వతి, గాయాలతో బయట పడ్డ శ్రీనివాసరావు, శిరీష

ఘటనా స్థలంలో భార్య మృతి

స్వల్ప గాయాలతో బయటపడ్డ భర్త, కుమార్తె

తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): బంధువులు నిర్మించుకున్న పాఠశాల నూతన భవనం గృహ ప్రవేశానికి వెళ్లి  తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న  ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటలో భార్య అక్కడికక్కడే మరణించగా భర్త, కుమార్తె స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కె.గంగవరం మండలం పాతకోటకు చెందిన చేకూరి శ్రీనివాసరావు, భార్య సరస్వతి (37), కుమార్తె శిరీషతో కలిసి రాయవరంలో గృహ ప్రవేశానికి హాజరయ్యారు. వారు మోటారు సైకిల్‌పై శుక్రవారం తిరిగి ఇంటికి వెళ్తుండగా రాయవరం మండలంలో మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య మండపేట కెనాల్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసరావు, శిరీషలకు స్వల్పగాయాలయ్యాయి.

వారిని 108 అంబులెన్సులో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మోటార్‌ సైకిల్‌పై ప్రయాణిస్తున్న శిరీష చున్నీ బస్సు కింది భాగంలో ఇరుక్కొందని, వీరు ప్రయాణిస్తున్న ఎడమవైపు రహదారి అంచు ప్రమాదకరంగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదం ఏ విధంగా జరిగిందన్నది పోలీసుల విచారణలో తేలాలి. మృతురాలి కుమారుడు గిరిధర్‌ బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతుండగా, కుమార్తె శిరీష రామచంద్రపురంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రాయవరం ఎస్సై కొండపల్లి సురేష్‌బాబు ఘటనా స్థలాన్ని సందర్శించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావు, ఏడీఎం ప్రతిమ సంఘటన స్థలాన్ని సందర్శించారు.

ప్రమాదంగా రహదారి బెర్మ్‌
మండపేట– కాకినాడ ప్రధాన రహదారి బెర్మ్‌ ప్రమాదకరంగా ఉండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు అసువులు బాశారు. ముఖ్యంగా మండపేట వంతెన వద్ద నుంచి రాయవరం మండలం పసలపూడి వరకు రహదారి బెర్మ్‌ ప్రమాద భరితంగా ఉంది. బెర్మ్‌ గుంతలు పడి ఉండడంతో వాహనాలు వచ్చినప్పుడు తప్పుకునే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. మండపేట నుంచి కాకినాడ వరకు రహదారి విస్తరణలో భాగంగా మండపేట నుంచి రాయవరం మండలం పసలపూడి వరకు పనులు జరగలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రహదారిని విస్తరించడంతో పాటు రహదారి బెర్మ్‌ను అభివృద్ధి చేయాలని పలువురు ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు