కుళాయి వద్ద ఘర్షణ.. మహిళ మృతి

10 May, 2019 12:53 IST|Sakshi
తోపులాటలో మృతి చెందిన మౌలాబీ

నీటి వంతుల విషయంలో వివాదం  

గుక్క పట్టి ఏడుస్తున్న రెండు నెలల బిడ్డను వదిలి..గుక్కెడు మంచినీళ్ల కోసం ఆమె ఇంటి నుంచి బయటకు కదిలింది..మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా కుళాయి వద్ద నిరీక్షించింది.. ఆమె వంతు వచ్చే సరికి గొడవ ప్రారంభమైంది..మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. తోపులాటలో ఆమె కింద పడి ఈ లోకాన్ని వీడింది. ఈ విషాద ఘటన కర్నూలు నగరం లక్ష్మీనగర్‌లో గురువారం మధ్యాహ్నం
చోటుచేసుకుంది. నీటి సమస్య  ఓ నిండు ప్రాణాన్ని తీయడం స్థానికులను కలచి వేసింది.  

కర్నూలు: కర్నూలు నగరం లక్ష్మీనగర్‌లో వీధికుళాయి దగ్గర వంతుల వారీగా నీళ్లు పట్టుకునే విషయంలో గొడవ చోటు చేసుకుని తీవ్ర ఘర్షణకు దారితీసింది. తోపులాటలో మౌలాబీ (23) అనే మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న షేక్షావలి, షేకున్‌బీ రెండో కూతురైన మౌలాబీకి డోన్‌కు చెందిన మహమ్మద్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈమె రెండు నెలల క్రితం పుట్టినింటికి ప్రసవానికి వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది.

గురువారం ఇంటి పక్కన ఉన్న వీధి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో సమీపంలో నివాసం ఉంటున్న రామచంద్రమ్మతో వివాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. రామచంద్రమ్మ కుటుంబ సభ్యులంతా కలిసి మౌలాబీని కిందకు తోసేయడంతో ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు మూడో పట్టణ సీఐ హనుమంతనాయక్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఇరుగుపొరుగువారిని విచారించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రమ్మతో పాటు భర్త రత్నమయ్య, కూతురు మనీషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు