వివాహిత అనుమానాస్పద మృతి

3 Feb, 2019 10:52 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న లావేరు తహసీల్దార్, ఎస్‌ఐ లక్ష్మి (పైల్‌ఫొటో

లావేరు: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కిల్లారి లక్ష్మి(24) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. లావేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఉంగరాడ లక్ష్మునాయుడు కుమార్తె లక్ష్మిని అదే గ్రామానికి చెందిన కిల్లారి వెంకటికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఈ నెల 1న లక్ష్మి ఉపాధి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆరు గంటల సమయంలో ఆవుకు దాణా పెట్టడం కోసమని లక్ష్మిని తండ్రి పిలవగా ఇంటి నుంచి ఎంతకూ రాలేదు. దీంతో లోపలికి వెళ్లి చూడగా కుమార్తె సోఫాలో పడిపోయి నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించింది.

వెంటనే గ్రామస్తులకు విషయం తెలియజేసి లక్ష్మిని ఆటోలో లావేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న లావేరు తహసీల్దార్‌ ఎస్‌.సుధాసాగర్, ఎస్‌ఐ చిరంజీవిలు శనివారం రిమ్స్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. లక్ష్మి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను, భర్తను అడిగితెలుసుకున్నారు.

తహసీల్దార్‌ సమక్షంలో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. లావేరు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.లక్ష్మీ మృతి వెనుక కారణాలు తెలియరావడం లేదు. ఆత్మహత్య చేసుకుందా లేదా పాముకాటుకు గురైందా అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవని మృతురాలి తండ్రి లక్ష్మునాయుడు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

మరిన్ని వార్తలు