చెట్టు మీద పడి మహిళ దుర్మరణం

5 Jul, 2019 09:18 IST|Sakshi
ఏలూరు వన్‌టౌన్‌లో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : దశాబ్దాల కాలం చరిత్ర గల మర్రి చెట్టు (పెరుగుచెట్టు) గురువారం ఉదయం ఒక్కసారిగా నేలకొరిగింది. చెట్టు ఒక్కసారిగా నేలకి ఒరగడంతో అటుగా వెళ్లుతున్న ఓ మహిళ దాని కింద పడి దుర్మరణం పాలైంది. చెట్టు పడిపోయిందని తెలుసుకున్న నగరవాసులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తంచేశారు. ఎటువంటి గాలి, వాన లేకుండా చెట్టు నేలకొరగడంపై ఎవరి హస్తమైనా ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతంలోని పెరుగుచెట్టు సెంటర్‌ వద్ద ఓ మర్రిచెట్టు ఉంది. దశాబ్దాల కాలం నుంచి ఈ చెట్టు వద్ద పాలు, పెరుగు విక్రయిస్తున్నారు.

దాంతో ఈ ప్రాంతానికి పెరుగుచెట్టు సెంటరుగా పేరు వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. ఈ చెట్టుకు స్థానికులు తరచూ పూజలు కూడా చేస్తుంటారు. గతంలో భారీ గాలివానలు వచ్చిన సందర్భాల్లో కూడా ఈ చెట్టు కొమ్మలు కూడా ఒరిగిన సందర్భాలు లేవని, గురువారం మాత్రం ఒక్కసారిగా నేలకూలిందని స్థాని కులు అంటున్నారు. చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న నగరపాలకసంస్థ కమిషనర్‌ ఎ.మోహనరావుతో పాటు ఏఈ రామారావు, పోలీసులు, ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చెట్టును తొలగించి, మహిళ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మహిళ దుర్మరణం
పెరుగుచెట్టు ఒక్కసారిగా నేలకు ఒరగడంతో అటుగా వెళుతున్న స్థానిక 9వ డివిజన్‌కు చెందిన మాణిక్యాల  వెంకటరమణ(48)అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.  చెట్టు మీద పడటంతో బయటకు వచ్చే మార్గం లేక ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది. వెంకటరమణ తన కుటుంబసభ్యులతో కలిసి కాలువల వెంబడి పనికిరాని వస్తువులను సేకరించి విక్రయించుకుని జీవిస్తుంటారు. గురువారం ఉదయం కూడా తన కుమారులతో కలిసి చెట్టు కింద ప్రాంతంలో పనికిరాని వస్తువులను సేకరిస్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారు ప్రమాదం నుంచి తప్పిం చుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాపత్రికి తరలించారు. మృతురాలి భర్త సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వన్‌టౌన్‌ ఎస్సై నరహరశెట్టి రామకిషోర్‌బాబు తెలిపారు.

పథకం ప్రకారమే జరిగిందా ?
సుమారు 100 ఏళ్ల  చరిత్ర గల మర్రిచెట్టు (పెరుగుచెట్టు) ఒక్కసారిగా నేలకు ఒరగడంపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చె ట్టుకు ఆనుకుని ఉన్న స్థలంలో భారీ వాణిజ్య భవనం నిర్మాణంలో ఉంది.  చెట్టు కారణంగా సదరు  భవనం కనిపించకుండా పోయిందనే ఉద్దేశంతో చెట్టు వేరులను కొద్దిరోజులుగా ధ్వంసం చేస్తూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అలానే చెట్టు మొదల్లో కెమికల్‌ పోయడంతో దాని ప్రభావంతో ఒక్కసారిగా చెట్టు కూలినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పెరుగుచెట్టు కారణంగా తన భవనం ము సుకుపోయిందని చెట్టును తొలగించాలంటూ సద రు భవన నిర్మాణదారుడు అటవీశాఖ కార్యాలయంలో వినతి సమర్పించగా.. అధికారులు చె ట్టును తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. దీంతో ఎలాగైనా చెట్టును తొలగించేందుకు భవన నిర్మాణదారుడు ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచా రణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు