‘బదిలీ అడిగితే కోరిక తీర్చమన్నారు’

4 Nov, 2018 09:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆవేదన వ్యక్తం చేసి గుజరాత్‌ మహిళా హోంగార్డులు

సూరత్‌ : కోరుకున్న చోటుకి బదిలీ చేయమంటే ఉన్నతాధికారులు కోరికలు తీర్చమంటున్నారని గుజరాత్‌ మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 మంది మహిళా హోం గార్డులు శుక్రవారం ఇద్దరు ఉన్నతాధికారులపై సూరత్‌ పోలీస్‌ కమిషనర్‌ సతీష్‌ శర్మకు ఫిర్యాదు చేశారు. కొద్దీ రోజులుగా పై అధికారులు తమను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని నాలుగు పేజీలతో కూడిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ అధికారులు బదిలీ చేయాలంటే డబ్బులివ్వాలని, లేకపోతే వారి కోరిక తీర్చాలంటున్నారని ఆరోపించారు. ఓ అధికారైతే యూనిఫామ్‌ సరిచేసుకోవాలని తాకరని చోట చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదును డీసీపీకి పంపించామని, జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ ప్రారంభించిందని నగర కమిషనర్‌ సతీష్‌ శర్మ మీడియాకు తెలిపారు. హోమ్‌గార్డులు పోలీస్‌ శాఖలోకి రారని, దీంతో పోలీసులు అంతర్గత కమిటీ కాకుండా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతుందన్నారు. అలాగే ఈ ఫిర్యాదును హోంమంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా పంపించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే ఆ శాఖ మహిళా ఉద్యోగులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు