పాతకక్షలతో మహిళ దారుణ హత్య

15 Nov, 2019 08:20 IST|Sakshi

రంగాపూర్‌లో ఘటన

మృతదేహంతో బంధువుల ఆందోళన

16 మందిపై కేసు నమోదు చేసిన పోలీసుల

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌) : పాతకక్షలు హత్యకు దారి తీసిన ఘటన హుజూరాబాద్‌ మండలం రంగాపూర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. మండలంలోని రంగాపూర్‌ గ్రామానికి చెందిన బండ సమ్మక్క–రాజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు, కుమార్తెకు వివాహం అయింది. చిన్న కుమారుడు వినయ్‌ అదే గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాస్‌ కుమార్తెను ఈవ్‌టీజింగ్‌ పాల్పడుతున్నట్లు గతంలో పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరుకుటుంబాల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. దీంతో ఇరుకుటుంబాలు గ్రామం విడిచి వేరే చోట నివసిస్తున్నారు. ఇటీవల దీపావళి వేడుకలకు ఇరుకుటుంబాలు వచ్చాయి. 

నల్లాపైపు పగిలిందని గొడవ 
రెండురోజులక్రితం నల్లాపైపు పగిలిందని బొడ్డు శ్రీనివాస్‌ కుటుంబం బండ సమ్మక్కను ఉద్దేశించి తీవ్ర దుర్భాషలాడారు. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య ఆగ్రహావేశాలు పెరిగాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బండ సమ్మక్క(45) ఒంటరిగా రోడ్డుపైకి రాగా ఇదే అదునుగా భావించిన బొడ్డు శ్రీనివాస్‌ కుటుంబం ఆమెను వెంబడిస్తూ బండరాళ్లతో గట్టిగా నెత్తిపై మోదడంతో తీవ్రరక్తస్రావం అయి అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. స్థానికులు, కుటుంబసభ్యుల నుంచి హత్యకు దారి తీసిన కారణాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతదేహంతో సమ్మక్క కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. సమ్మక్క కోడలు బండ మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకే కుటుంబానికి చెందిన 16 మంది కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ వాసంశెట్టి మాధవి తెలిపారు.

మరిన్ని వార్తలు