రెండో భర్తను కత్తితో పొడిచి చంపింది..కానీ ఏడేళ్ల తర్వాత..

4 Nov, 2018 17:34 IST|Sakshi
మణిమేఖలైను జైలుకు తరలిస్తున్న పోలీసులు

సాక్షి, చెన్నై : రెండవ భర్తను హత్య చేసి కేరళకు పారిపోయిన మహిళను ఏడేళ్ల తరువాత అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితురాలిని శనివారం పుళల్‌ జైలుకు తరలించారు. వివరాలు.. కేరళ రాష్ట్రం ఎస్‌పీ పురం ప్రాంతానికి చెందిన సంజప్పన్‌ భార్య మణిమేఖలై(52). ఈమె తొమ్మిదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన కార్తికేయన్‌ను రెండో వివాహం చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపం పాప్పన్‌కుప్పంలో కాపురం పెట్టింది. రెండేళ్ల తరువాత మణిమేఖలైకు, కార్తికేయన్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. మనస్తాపం చెందిన మణిమేఖలై మొదటి భర్త సంజప్పన్‌ పిల్లల వద్దకు వెళుతున్నట్టు ఘర్షణకు దిగింది. ఇందుకు రెండవ భర్త ఒప్పుకోకపోవడంతో 2011, జనవరిలో ఇద్దరూ ఘర్షణ పడ్డారు.

ఆగ్రహంతో మణిమేఖలై, కార్తికేయన్‌ను కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం కేరళకు పారిపోయింది. ఈ సంఘటనపై గుమ్మిడిపూండి పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. ఇంత వరకు మహిళను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపరచలేదు. నిందితులరాలిని వెంటనే హజరుపరచాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేరళకు వెళ్లిన ప్రత్యేక బృందం మణిమేఖలైను అరెస్టుచేసి శనివారం తిరువళ్లూరు కోర్టు న్యాయమూరి ధీప్తిఅరుల్‌మెళి ఎదుట హజరుపరిచారు. న్యాయమూర్తి నిందితురాలికి రిమాండ్‌ విధించడంతో పుళల్‌ జైలుకు తరలించారు. 

>
మరిన్ని వార్తలు