కబ్జాల కి‘లేడీ’

18 Oct, 2019 12:11 IST|Sakshi
నిందితురాలు సానియా అజ్జనీ

రూ.16 కోట్ల విలువైన 9 ప్లాట్ల కబ్జాకు యత్నం  

బాధితుల ఫిర్యాదుతో నిందితురాలి అరెస్టు  

విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు  

గచ్చిబౌలి: ఎన్‌ఆర్‌ఐ,హైకోర్టు అడ్వొకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేస్తోంది ఓ కి‘లేడీ’. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒకటా రెండా ఏకంగా 2,700 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. ఈ స్థలం విలువ రూ.16 కోట్లకు పైగానే ఉంటుంది. సదరు మహిళ ఆగడాలు శృతి మించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితురాలిని గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 11న అరెస్ట్‌ చేశారు. మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటంతో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన ప్రకారం... మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్‌ నస్రీన్‌ సయిదా అలియాస్‌ సానియా అజ్జనీ(40) కొద్ది నెలలుగా కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీనగర్‌ కాలనీ, మాధవహిల్స్‌లో అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఖాళీ ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తోంది. రాఘవేంద్ర కాలనీలో 200 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్‌ నంబర్‌ ‘495ఈ’లో యజమాని రామకృష్ణ బోరు వేస్తుండగా సానియా రంగప్రవేశం చేసింది. అనుచరులతో బెదిరింపులకు పాల్పడి ప్లాట్‌ను చదును చేసి ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నించింది. దీంతో బాధితుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. క్రైమ్‌ నంబర్‌ 738/2018, మరో నాన్‌ బెయిలెబుల్‌ కేసు క్రైమ్‌ నంబర్‌ 634/2018లో నిందితురాలిని ఈ నెల 11న నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. మరో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉండడంతో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

కొండాపూర్‌లోని రాజరాజేశ్వరీనగర్‌ కాలనీలో గిరిజ లక్ష్మీకి 400 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్‌ నంబర్లు 1264, 1265 ఉన్నాయి. వీటికి సానియా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అనుచరులతో బెదిరింపులకు పాల్పడింది. ప్రహరీ నిర్మించే క్రమంలో మెటీరియల్‌ తేవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి ఉడాయించింది. ఈ కేసు (క్రైమ్‌ నంబర్‌ 188/2018) పెండింగ్‌లో ఉండటంతో ఇప్పటికే సానియాకు నోటీసులు జారీ చేశారు.  
కొండాపూర్‌లోని మాధవహిల్స్‌ లేఅవుట్‌లో ప్రవీణ్‌కుమార్‌కు 799 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్‌ నంబర్‌ 2, 3లకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన సానియా కబ్జా చేసేందుకు అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది. ప్లాట్‌ను చదును చేసి ప్రహరీ నిర్మించేందుకు యత్నించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు (క్రైమ్‌ నంబర్‌ 604/2018) గతంలోనే నోటీసులు జారీ చేశారు.  
రాజరాజేశ్వరీనగర్‌ కాలనీలో అరుణ్‌కుమార్‌ ఆప్టెకు 900 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్‌ నంబర్‌ 164,165,166 ఉన్నాయి. వాచ్‌మెన్‌ను సానియా అనుచరులు బెదిరించారు. ప్రహరీ నిర్మించేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు (క్రైమ్‌ నంబర్‌ 468/2019) నమోదు చేసి, నిందితురాలికి నోటీసులు జారీ చేశారు.
కొండాపూర్‌లోని మాధవహిల్స్‌లో ఉపేంద్రనాథ్‌కు 400 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్‌ ఉంది. ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేశారు. సానియా అనుచరులు తాళం పగులగొట్టి ప్లాట్‌ను కబ్జా చేశారు. లోపల షెడ్డు నిర్మాణం చేపట్టారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు (క్రైమ్‌ నంబర్‌ 531/2019) నమోదు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండడంతో పోలీసులు సానియాకు నోటీసులిచ్చారు.  

కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఎన్‌ఆర్‌ఐ, హైకోర్టు అడ్వొకేట్‌ అని చెప్పుకుంటూ ఖాళీ ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నించడం, నాన్‌ బెయిలెబుల్‌ కేసు పెండింగ్‌ ఉండడంతో సయ్యద్‌ నస్రీన్‌ సయిదా అలియాస్‌ సానియా అజ్జనీని అరెస్ట్‌ చేశాం. నిందితురాలికి మరో నాలుగు కబ్జా కేసుల్లో నోటీసులిచ్చాం. కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.   – ఆర్‌.శ్రీనివాస్, సీఐ

మరిన్ని వార్తలు