తాగిన మత్తులో.. రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్‌

21 Jan, 2019 08:45 IST|Sakshi

బంజారాహిల్స్‌: తాగిన మత్తులో కొందరు మహిళలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌చేస్తూ దూసుకుపోతున్న యువతులను అడ్డుకున్న పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడమేగాక రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. బంజారాహిల్స్‌కు చెందిన న్యాయవాది ఓ పబ్‌లో ఫుల్లుగా తాగి ఆడి కారు డ్రైవ్‌  నడుపుతూ వెళుతుండగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని డైమండ్‌ హౌజ్‌ వద్ద పోలీసులు కారును ఆపి, ఆమెకు శ్వాస పరీక్షలు నిర్వహించగా బీఏసీ(బ్లడ్‌ ఆల్కహాల్‌ కంటెంట్‌) 121 పాయింట్లుగా నిర్ధారణ అయింది.

ఆమె కారును సీజ్‌ చేశారు. టోలిచౌకికి చెందిన మరో యువతి బీవీబీపీ చౌరస్తా పాయింట్‌లో పోలీసులకు పట్టుబడింది. ఆమెకు శ్వాస పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు 63 పాయింట్లుగా నమోదైంది.  పోలీసులు కారును సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 104 మంది పట్టుబడ్డారు. ఇందులో 55 ద్విచక్ర వాహనాలు, 49 కార్లు ఉన్నాయి. పట్టుబడిన యువతులకు వారి భర్తలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఒక్క జూబ్లీహిల్స్‌లోనే జరిగిన తనిఖీల్లో 20 కార్లు, 13 బైక్‌లు పట్టుబడటం గమనార్హం.

పోలీసులకు ఫిర్యాదు...  
ట్రాఫిక్‌ పోలీసులు శ్రీనగర్‌కాలనీ మెయిన్‌రోడ్డులోని సత్యసాయి నిగమాగమం వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండగా మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడుపుతున్న నవీన్‌కుమార్‌(36) పోలీసులకు చిక్కాడు. అతను శ్వాస పరీక్షలకు తీవ్ర ఆటంకం కలిగించారు. ఆయనతో పాటు కారులో కూర్చున్న స్నేహితుడు బల్వంతరావు కూడా శ్వాస పరీక్షలు నిర్వహిస్తుండగా న్యూసెన్స్‌కు పాల్పడ్డాడు. నవీన్‌కుమార్‌కు శ్వాస పరీక్షలు నిర్వహించగా ఆల్కహాల్‌ కౌండ్‌ 101 ఎంజీ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించి న్యూసెన్స్‌కు పాల్పడిన నవీన్‌కుమార్, బల్వంతరావులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ జె. నిరంజన్‌రావు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు