స్కూటీ అదుపుతప్పి మహిళ దుర్మరణం

21 May, 2018 20:25 IST|Sakshi

మాడుగులపల్లి (నల్లగొండ) : స్కూటీ అదుపుతప్పి ఓ మహిళ దుర్మరణం చెందగా మరో ఇద్దరు చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఆగమోత్కూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్‌ మండలం కల్మెర గ్రామానికి చెందిన సోమిడి స్రవంతి స్కూటీపై ఇద్దరు చిన్నారులతో కలిసి మాడ్గులపల్లి మండలం జాల్‌బాయిగూడెంలో నివాసముంటున్న బంధువు నాతాల రాంరెడ్డి ఇంటికి వచ్చింది. అక్కడ పనులు ముగించుకుని సాయంత్రం ఇద్దరు చిన్నారులతో కలిసి స్వగ్రామానికి తిరుగు పయనమైంది. 

మార్గమధ్యలో ఆగమోత్కుర్‌ గ్రామ శివారులో స్కూటీ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో పాములపహడ్‌ గ్రామం నుంచి  ధాన్యాన్ని తీసుకుని వేగంగా వస్తున్న లారీ, కింద పడిన స్రవంతిపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెనుక కూర్చున్న చిన్నారులు మరోవైపు పడడంతో స్వల్పగాయాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్‌ఐ జయరాజ్‌ తెలిపారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు