ఆడ బిడ్డ పుట్టలేదని.. అపహరించింది 

2 Feb, 2020 11:42 IST|Sakshi
చిన్నారిని అపహరించిన చంద్ర కళావతి; తల్లి చెంతకు చేరిన చిన్నారి

ఓ మహిళ ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది. ఇక ఆడ బిడ్డ కావాలనుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఇక పిల్లలు పుట్టరని డాక్టర్లు నిర్ధారించడంతో నిరుత్సాహానికి గురైంది. ఎలాగైనా తనకు ఆడ పిల్ల కావాలనుకుంది. గర్భం దాల్చినట్లు పుట్టినింటి వారిని నమ్మించింది. ఆ నమ్మకాన్ని నిజం చేసే క్రమంలో తొమ్మిది రోజుల పసి కందును అపహరించింది. పసికందు తల్లి ఫిర్యాదుతో అలర్ట్‌ అయిన పోలీసులు రెండు గంటల్లోనే పసి పాపను తల్లి ఒడికి చేర్చి, నిందితురాలిని కటకటాలకు పంపి శభాష్‌ అనిపించుకున్నారు. ఆ వివరాలను ఎస్పీ ఫక్కీరప్ప విలేకరులకు వెల్లడించారు. 

సాక్షి, కర్నూలు : ఆత్మకూరుకు చెందిన చంద్రకళావతికి ప్యాపిలికి చెందిన నాగమద్దయ్యకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చంద్ర కళావతి ప్యాపిలి బాలికల వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆడబిడ్డ కావాలన్న కోరిక చంద్ర కళావతికి ఉన్నా.. అనారోగ్య కారణాల వల్ల పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే పుట్టినింట్లో మరోసారి గర్భం దాల్చినట్లు చెప్పి నమ్మించింది. నాలుగు రోజుల క్రితం భర్తకు చెప్పకుండా పుట్టినింటికి వెళ్లింది. అటు నుంచి కర్నూలు పెద్దాస్పత్రికి చేరుకుంది. కాగా గోనెగండ్ల మండలం చిన్ననెలటూరు గ్రామానికి చెందిన మరియమ్మ, రామాంజనేయులు దంపతులకు ఇద్దరు సంతానం. తొమ్మిదిరోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం చెల్లెలు పుష్పావతి, తమ్ముడు జగదీష్‌తో కలిసి శనివారం ఉదయం చిన్నపిల్లల వార్డుకు వెళ్లింది. అదే సమయంలో మరియమ్మను చంద్ర కళావతి పరిచయం చేసుకుంది. తమది గుత్తి పట్టణమని తోడి కోడలు కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చినట్లు నమ్మించింది. మరియమ్మ చేతిలో ఉన్న బిడ్దను ఎత్తుకొని ఆడిపించుకుంటూ కొద్దిసేపు అక్కడే ఉండి నమ్మకం కలిగించింది. తొమ్మిదిన్నర గంటల సమయంలో వార్డుకు డాక్టర్‌ చేరుకోవడంతో మరియమ్మ వైద్య పరీక్షలు చేయించుకొని పరీక్షల కోసం సెంట్రల్‌ ల్యాబ్‌కు వెళ్లింది. ఆ సయమంలో చంద్ర కళావతి చేతిలో బిడ్డను పెట్టి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఆమెతో పాటు తనబిడ్డ కనిపించకపోవడంతో మరియమ్మ మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టణంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఫేస్‌బుక్‌ వాట్సాప్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు.  

యువకుడు తీసిన వీడియోనే ఆధారం.. 
చంద్ర కళావతి ముఖానికి గుడ్డను కట్టుకొని పసిబిడ్డను తీసుకొని వెళ్లే సయమంలో సమీపంలో ఉన్న ఓ యువకుడు ఫొటో, వీడియో తీశాడు. అంతకుముందు వాళ్ల పాపను కూడా ఆడించేందుకు తీసుకునే ప్రయత్నం చేయగా వారు నిరాకరించారు. మరియమ్మ కూతురును తీసుకొని వెళ్తుండటంతో యువకుడు అనుమానంతో ఫొటో తీసి పోలీస్‌ గ్రూప్‌లో పెట్టాడు. అప్పటికే దర్యాప్తులో ఉన్న పోలీస్‌లు ఈ ఫొటో ఆధారంగా కేసును ఛేదించారు. 

మరో వైపు మిస్సింగ్‌ కేసు.. 
చంద్ర కళావతి నాలుగు రోజుల క్రితం భర్తకు చెప్పకుండా పుట్టినిల్లు ఆత్మకూరుకు వెళ్లింది. ఆమె ఫోన్‌ స్పిచ్ఛాఫ్‌ రావడంతో తప్పిపోయినట్లు భర్త నాగమద్దయ్య ప్యాపిలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో పసికందును అపహరించిన మహిళ ఫొటోను చూసి ప్యాపిలి ఎస్‌ఐ మారుతీ శంకర్‌ చంద్ర కళావతిపై అనుమానం వచ్చి ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా మంచంపై పసికందుతో ఆడుకుంటూ కన్పించింది. పాప ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీయగా సరైన సమాధానం చెప్పక పోవడంతో అనుమానం వచ్చింది. పసిపాపను ఫొటో తీసి మూడో పట్టణ పోలీస్‌లకు పంపగా మరియమ్మ చూసి తనబిడ్డగా గుర్తించింది.

దీంతో పోలీస్‌లు చంద్రకళావతితోపాటు శిశువును తీసుకొని ఎస్పీ చేతుల మీదుగా తల్లి ఒడికి చేర్చారు. దీంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమై పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బిడ్డను అప్పగించినందుకు తల్లి కన్నీటి పర్యంతమై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. రెండు గంటల వ్యవధిలోనే కేసును చేధించినందుకు ప్యాపిలి ఎస్‌ఐ మారుతీ శంకర్‌తో పాటు కర్నూలు సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారులందరిని ఎస్పీ అభినందించారు. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి తుషార్‌ డుడి, ఓఎస్‌డీ ఆంజనేయులు, డీఎస్పీలు రమణమూర్తి, బాబా ఫకృద్దీన్, మూడో పట్టణ సీఐ తబ్రేజ్‌  విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు