మహిళా పోలీసు ఆత్మహత్య

26 Mar, 2019 13:01 IST|Sakshi
అముద (ఫైల్‌)

తమిళనాడు , టీ.నగర్‌: ఉసిలంపట్టి సమీపంలో మహిళా పోలీసు ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. మదురై జిల్లా ఉసిలంపట్టి పరిధిలోని గుంజాంపట్టి గ్రామానికి చెందిన ముత్తువాళన్‌ ఆటోడ్రైవర్‌. ఇతని భార్య అముద (30). ఈమె ఉసిలంపట్టి మహిళా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అన్బురాజ్‌ అనే కుమారుడు, ఝాన్సి అనే కుమార్తె ఉన్నారు. వీరు గుంజాంపట్టి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎస్‌ఐ పరీక్షల కోసం అముద చదువుతోంది. భార్య చదువుకు ఆటంకం కలిగించకూడదని ముత్తువాళన్‌ ఆదివారం రాత్రి మిద్దెపై ఉన్న గదిలో నిద్రించాడు. పిల్లలు మరో గదిలో నిద్రించారు.

సోమవారం ఉదయం చాలా సేపయినప్పటికీ అముద ఉన్న గది తలుపు తెరుచుకోలేదు. దీని గురించి పిల్లలు  తండ్రికి తెలిపారు. రాత్రంతా చదివి ఆదమరచి నిద్రపోయి ఉంటుందని, ఆమెను లేపకుండా స్కూలుకు వెళ్లమని వారికి తెలిపాడు. ఇలావుండగా కిటీకీ నుంచి చూసిన అన్బురాజŒ బిగ్గరగా కేకలు వేశారు. ముత్తువాళన్‌ తలుపు పగులగొట్టి చూడగా అముద ఉరి వేసుకుని మృతిచెందింది. సమాచారం అందుకున్న ఉసిలంపట్టి డీఎస్సీ రాజా ఆధ్వర్యంలోని పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇది కుటుంబ సమస్య లేదా అధికారుల వేధింపుల కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు