ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో తీసిన విద్యార్థి

25 Sep, 2019 09:25 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకి చెందిన వివేశ్‌ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివేశ్‌ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో వివేశ్‌తో ప్రొఫెసర్‌ స్నేహంగా మెలిగారు. గత 19వ తేదీ వివేశ్‌ తన చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తానని తెలిపి ప్రొఫెసర్‌ను పిలిచాడు. ఇందుకు ప్రొఫెసర్‌ సమ్మతించింది. రాత్రి ఏడు గంటల సమయంలో షోలింగ నల్లూర్‌లో ప్రొఫెసర్‌ ఉంటున్న మహిళా హాస్టల్‌కు వివేశ్‌ వెళ్లాడు.

అనంతరం ఆమెను తన బైకులో ఎక్కించుకుని ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డుకు వెళ్లాడు. పూంజేరి సమీపాన గల చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఆపాడు. దీంతో భీతి చెందిన ప్రొఫెసర్‌ ఎందుకు ఇక్కడ ఆపావని ప్రశ్నించగా లోపల రిసార్ట్‌ ఉందని, అక్కడ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. తర్వాత పొదలు ఉన్న చోటుకు ఆమెను తీసుకెళ్లి కత్తి చూపి, దుస్తులు విప్పమని బెదిరించాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించాడు. ఈ విషయం బయట చెప్పకూడదని బెదిరించి మళ్లీ ఆమెను హాస్టల్లో దింపివేశాడు. తర్వాత తనతో గడపాలని, లేకుంటే నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సెమ్మంజేరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివేశ్‌ను అరెస్టు చేసి ప్రొఫెసర్‌ నగ్న వీడియోను డిలీట్‌ చేశారు. అతన్ని సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా