మద్యం కోసం వస్తే పొడుస్తా.. గృహిణి హల్‌చల్‌

1 Mar, 2019 08:05 IST|Sakshi
కత్తితో వచ్చి ఆందోళన చేస్తున్న కవిత   

సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ బాధ్యతలు విస్మరించి మద్యానికి బానిసైన భర్తతో ఆ గృహిణి విసిగిపోయింది. 24 గంటలూ సాగుతున్న మద్యం విక్రయాలపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మద్యం అమ్మకాలు సాగిస్తున్న టాస్మాక్‌ దుకాణం ఎదుట రెండు కత్తులతో బుధవారం ధర్నాకు దిగింది. ‘మద్యం కోసం వచ్చారో కత్తితో పొడిచేస్తా లేదా పొడుచుకుంటా’ అంటూ నినాదాలు చేస్తూ హల్‌చల్‌ చేసింది. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు.. తిరుపూరు జిల్లాలో చట్టవిరుద్ధంగా అనేక టాస్మాక్‌ దుకాణాలు వెలిసి 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నాయి.

పోలీసులు తరచూ దాడులు జరుపుతూ అరెస్ట్‌లు సాగిస్తున్నా మద్యం విక్రయాలు మాత్రం ఆగడం లేదు. పీఎన్‌ రోడ్డు పాండియన్‌ నగర్‌లోని ఒక టాస్మాక్‌ దుకాణంలో తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో కవిత (25) అనే గృహిణి బుధవారం సదరు దుకాణం ముందు రోడ్డుపై బైఠాయించింది. ఆ తరువాత రెండు కత్తులు చేతపట్టుకుని ధర్నాకు దిగింది. ‘మద్యం తాగేందుకు ఎవ్వరూ రాకండి.. వస్తే పొడిచేస్తా లేకుంటే నేనే పొడుచుకుంటా’ అంటూ కేకలు పెట్టసాగింది. 

పరుగులు తీసిన మందుబాబులు
గృహిణి ఆందోళన సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకోగా టాస్మాక్‌ నిర్వాహకులు, మందుబాబులు పరుగులు తీశారు. పోలీసులు దుకాణంలోని రెండుపెట్టెల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఉద్యోగానికి వెళ్లకుండా  భర్త మద్యం తాగుతున్నాడని..
ధర్నాకి దిగిన కవిత మీడియాతో మాట్లాడుతూ మద్యానికి బానిసైన భర్త వడివేలు ఉద్యోగానికి వెళ్లకుండా నిరంతరం మద్యం తాగుతుంటాడని, రాత్రివేళల్లో నిద్ర మధ్యలో లేచివెళ్లి తెల్లవారుజామున కూడా మద్యం తాగి వస్తున్నాడని చెప్పింది. ఇద్దరు పిల్లల పెంపకం బాధ్యత తనపైనే పడడంతో కష్టపడుతున్నానని చెప్పింది. చట్టవిరుద్ధ బార్లు, అమ్మకం వేళలు పాటించని టాస్మాక్‌ దుకాణాలను అదుపులో పెడితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని పేర్కొంది. పోలీసులు కవితను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.  

మరిన్ని వార్తలు