క్షణికావేశమే మృత్యుపాశం

14 Jul, 2018 09:20 IST|Sakshi
బావిలో దూకి ఆత్యహత్య చేసుకున్న దేవుడమ్మ, బాలుడి మృతదేహాలు

జి.మాడుగుల(పాడేరు): మానసిక ఒత్తిడిలో క్షణికావేశంతో ఓ వివాహిత ముక్కుపచ్చలారని బిడ్డతో సహా పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో జరిగిన వాగ్వాదమే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడేలా చేసిందన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ సంఘటన జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ చేపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం మండలం నీలంపేటకు చెందిన చల్లా లోవరాజు ఈ ప్రాంతంలో పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. మండలంలోని సింగర్భ పంచాయతీ చేపల్లికి చెందిన దేవుడమ్మ(దేవి)(28)ను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ముగ్గురు సంతానం. నాలుగేళ్ల దేవరాజు, రెండేళ్ల పాప, ఏడు నెలల బాబు ఉన్నారు. కుంటుంబంతో చేపల్లిలోనే ఉంటున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళతానని లోవరాజు భార్యతో చెప్పాడు. ఆమె ససేమిరా అంది. ఈమేరకు ఇద్దరి మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. పిల్లలు, తనను విడిచి భర్త దూరంగా వెళ్లడం ఇష్టంలేక దేవుడమ్మ మానసికంగా ఒత్తిడికి గురైంది. అదే రోజు రాత్రి భోజనం అనంతరం ఏడు నెలల చంటిబిడ్డతో ఇంటిలో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఉదయానికి భార్యబిడ్డ కనిపించకపోవడంతో..వారి ఆచూకీ  కోసం బుధవారం గ్రామస్తులతో కలిసి బంధువుల ఇళ్లు, పలు ప్రాంతాల్లో లోవరాజు వెదికాడు. ఫలితం లేకపోయింది.

శుక్రవారం ఉదయానికి గ్రామానికి సమీపంలోని పాడుబడిన నేల బావి వద్ద చెప్పులు, దుప్పటి, టార్చిలైటు కనిపించాయి. వెళ్లి పరిశీలించగా బాలుడు బావిలో శవమైన కనిపించాడు. అందులో వెతకగా కొంత సేపటికి దేవుడమ్మ శవం కూడా బయటపడింది. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె సోదరుడు కిముడు బొంజాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త లోవరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఎస్‌ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా