మహిళ దారుణ హత్య

12 Jun, 2019 15:12 IST|Sakshi
 మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ నబీ  

కత్తితో మెడపై నరికివేతసహజీవనం చేస్తున్న వ్యక్తిపైనే అనుమానం 

సాక్షి, చిల్లకల్లు(కృష్ణా): వివాహితను కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటన జగ్గయ్యపేట పట్టణ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన కెడిలేటి ఏసమ్మ (35) గ్రామ సమీపంలోని బీఈడీ కళాశాల వద్ద నివసిస్తోంది. కొంత కాలం క్రితం భర్త వదిలేయటంతో ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన నాయక్‌తో సన్నిహితంగా ఉంటోంది. నాయక్‌ విజయవాడలో బ్యాగులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ రాత్రి వేళల్లో వచ్చి వెళ్తుంటాడు. అయితే గ్రామ సమీపంలోని రామస్వామిరాజా నగర్‌ వసతి గృహం వద్దనున్న ఖాళీ స్థలం వద్ద రక్తపు మడుగులో ఏసమ్మ మృతి చెంది ఉండటాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించారు.

వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పటంతో సీఐ అబ్దుల్‌ నబీ, చిల్లకల్లు, జగ్గయ్యపేట ఎస్‌ఐలు చిరంజీవి, ధర్మరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం నందిగామ డీఎస్పీ సుబాష్‌ చంద్రబోస్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి మెడపై ఐదు కత్తిపోట్లతో నరికి ఉండటంతో పాటు రక్తపు మడుగును చూస్తే సోమవారం అర్ధరాత్రి తొమ్మిది గంటలో సమయం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కొంత కాలంగా సహజీవనం..
ఏసమ్మ కొంత కాలంగా ఒడిశాకు చెందిన నాయక్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో బ్యాగులు అమ్ముకుంటూ రెండు, మూడు రోజులకొకసారి ఏసమ్మ వద్దకు వస్తుంటాడని, హత్యకు లావాదేవీలా, వివాహేతర సంబంధం అనే విషయం తెలియరాలేదని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు