కి‘లేడీ’

9 Feb, 2019 13:37 IST|Sakshi
నగలను దోచుకెళ్లిన మహిళ స్కూటీలో ఎర్రచీరెతో వెళుతున్న సదరు మహిళ డ్రస్‌ మార్చి మరో వ్యక్తితో బైక్‌లో వెళుతున్న దృశ్యం

మాటల్లో పెట్టి బంగారు నగలతో ఉడాయింపు

సీసీ కెమెరాల్లో రికార్డయిన వైనం

డ్రస్‌ మార్చుకుని మరో వ్యక్తితో పరార్‌

విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు

ప్రొద్దుటూరు క్రైం : మాటల్లో పెట్టి ఒక మాయ లేడీ పట్టపగలే ఇంట్లోని బంగారు నగలను దోచుకొని వెళ్లిన సంఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రిటైర్డ్‌ లెక్చరర్‌ బాలచంద్రారెడ్డి వైఎంఆర్‌ కాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. వారి ఇంటి పైభాగంలో బ్యాంకు ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. గురువారం గుర్తు తెలియని ఓ మహిళ బాలచంద్రారెడ్డి ఇంటి బయట ఉండగా ఆయన భార్య శంకరమ్మ వెళ్లి ఎవరు కావాలమ్మ అని అడగ్గా.. బ్యాంకు వాళ్ల కోసం వచ్చానని చెప్పింది.

దీంతో శంకరమ్మ పని చేసుకోవడానికి లోపలి గదిలోకి వెళ్లి పోయింది. ఆమె ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలోనే బయట ఉన్న కిలాడీ మహిళ ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న 11 తులాల బంగారు నగలను దోచుకుంది. లోపలి గదిలో నుంచి శంకరమ్మ బయటికి రాగా అప్పటికే ఆమె ఇంట్లో నుంచి వేగంగా ప్రధాన రహదారిలోకి వెళ్లింది. దారిలో స్కూటీలో వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి ఆస్పత్రికి వెళ్లాలని లిఫ్ట్‌ అడిగి కోర్టు సమీపంలో దిగింది. అప్పటి వరకు ఎర్ర చీరెలో ఉన్న ఆమె కోర్టు కాంపౌండ్‌లోకి వెళ్లి మరో డ్రస్‌తో బయటికి వచ్చింది. వెంటనే మరో వ్యక్తి బైక్‌లో రాగా అతని వెంట వెళ్లి పోయింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తిని విచారించిన పోలీసులు
ముందుగా స్కూటీలో లిఫ్ట్‌లో ఇచ్చిన వ్యక్తిని పోలీసులు గుర్తించి విచారించారు. ఈ విచారణలో అతను ఆమె తనకు తెలియదని, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలంటే లిఫ్ట్‌ ఇచ్చానని పేర్కొన్నాడు. ఆమెను చూస్తే గుర్తు పడతానని పోలీసులకు తెలిపాడు. ఆమెతో పాటు బైక్‌లో వెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇద్దరు కలిసే చోరీకి ప్రణాళిక రూపొందించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ పుటేజీల్లో రికార్డు అయిన వారి ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. నిందితుల ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేస్తామని త్రీ టౌన్‌ సీఐ జయానాయక్, ఎస్‌ఐ కృష్ణంరాజు నాయక్‌ తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతుంటే 91211 00589, 91211 00592 నంబర్లకు ఫోన్‌ చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు