నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు

22 Feb, 2020 03:23 IST|Sakshi

గుజరాత్‌లో మహిళలపై మరో దారుణం

సూరత్‌: ‘పీరియడ్స్‌’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్‌ హాస్టల్‌లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్‌లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో క్లర్క్‌లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు.

ఈ ఘటన ‘సూరత్‌ మున్సిపల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్‌ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్‌లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్‌ఎంసీలో క్లర్క్‌లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్‌ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు.

మరిన్ని వార్తలు