మంత్రాలు చేస్తుందని చంపేశారు

14 Aug, 2019 09:15 IST|Sakshi
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు,మృతురాలు లచ్చవ్వ

సాక్షి, వేములవాడ : మంత్రాల నెపంతో హత్యకు గురైన వృద్ధురాలు లచ్చవ్వ కేసు ఎట్టకేలకు వీడింది. మంత్రాలు చేయడం వల్లనే తమ కుటుంబం మొత్తం అనారోగ్యం బారినపడుతున్నారని, తమ తమ తల్లిదండ్రులు చనిపోయారని భావించి పండుగ లచ్చవ్వ(75)ను గత డిసెంబర్‌ 26న అర్ధరాత్రి గడ్డపారతో అతి కిరాతకంగా హత్య చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. వేములవాడ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సంకెపల్లి గ్రామంలో గత డిసెంబర్‌ 26న జరిగిన హత్య కేసు వివరాలను మంగళవారం వేములవాడ రూరల్‌ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ లచ్చవ్వను హత్య చేసిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు అనే సోదరులను మంగళవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు.

హత్యకు సహకరించిన ఎండీ షబ్బీర్, పండుగ నర్సయ్య, జింక అంజయ్య, జింక రాజు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పండుగ లచ్చవ్వ అనే వృద్ధురాలు మంత్రాలు చేయడం వల్లే కుటుంబం మొత్తం అనారోగ్యంబారిన పడుతుందని భావించిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు మరో నలుగురి సాయంతో లచ్చవ్వను హత్య చేయాలని పథకం రూపొందించారన్నారు. ఇందుకు వీరంతా కలిసి గడ్డపార, ఇసుపరాడ్డు, కత్తితో అతికిరాతకంగా లచ్చవ్వను చంపేశారని, జరిగిన హత్యపై సమాచారం అందకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారిందన్నారు.

హత్య జరిగిన ప్రదేశాన్ని, పరిస్థితులను బేరీజు వేసుకున్న వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, టౌన్‌ సీఐ ఎన్‌.వెంకటస్వామి బృందం టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకునేందుకు కృషి చేశారన్నారు. మొబైల్‌ కాల్‌డాటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారన్నారు. వీరిని పట్టుకు నేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని చాలాప్రాంతాలను వెతకాల్సి వచ్చిందన్నారు. హత్య కేసుతోపాటు బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు, ఎండీ షబ్బీర్‌పై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. హత్య కేసును ఛేదించిన టౌన్‌ సీఐ వెంకటస్వామి బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి రివార్డులు అందిస్తామన్నారు. సమావేశంలో రూరల్‌ సీఐ రఘుచందర్, పోలీసులు పాల్గొన్నారు.  

ముఢనమ్మకాలను నమ్మొద్దు 
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినప్పటికీ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని, ఇలాంటి వాటి ఉచ్చులో పడి మోసపోవద్దని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడితే వారి జీవితాలు, కుటుంబాలు వీధిన పడతాయని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణప్రాంతాల్లో మూఢనమ్మకాలపై తమ పోలీసు బృందాలు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నాయన్నారు. విద్యావంతులు, మేధావులు, యువతరం ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు.     

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా