ఇద్దరు మహిళలు దారుణ హత్య

4 Jan, 2019 10:40 IST|Sakshi
వరలక్ష్మి (ఫైల్‌) దేవకి ఫైల్‌ ఫోటో

వేపులబైలు వద్ద బండరాయితో మోది..

వేపగుంట క్రాస్‌ సమీపంలో గొంతు కోసి..

వివాహేతర సంబంధం, స్థల వివాదం నేపథ్యంలో హత్యలు?

జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. పీలేరు మండలంలో పశువుల మేతకు వెళ్లిన వివాహితను తలపై బండరాయితో మోది హతమార్చారు. పుత్తూరు మండలంలో మరో మహిళను గొంతు కోసి పొట్టన పెట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలకమైన ‘క్లూ’లు లభించాయి.

చిత్తూరు, పీలేరు: పశువులు మేపడానికి వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని వేపులబైలు వద్ద చోటు చేసుకుంది. పీలేరు ఎస్‌ఐ పీ.వీ. సుధాకర్‌కరెడ్డి కథనం.. వేపులబైలు పంచాయతీలోని వరంపాటివారిపల్లెకు చెందిన శేషాద్రి భార్య వరలక్ష్మి(36) బుధవారం ఆటోలో  సోమల మండలం కందూరుకు వెళ్లి పశువులకు దాణా తీసుకువచ్చింది. అనంతరం తమ పశువులు మేపడానికి ఇంటికి తాళం వేసి వెళ్లింది. భర్త శేషాద్రి మేస్త్రీ కావడంతో పని కోసం పీలేరుకు వచ్చారు. వీరి ఇద్దరు కుమారులు తేజ, దినేష్‌ పాఠశాలకు వెళ్లారు. మేస్త్రీ పనికి వెళ్లిన భర్త, స్కూలుకు వెళ్లిన ఇద్దరు కుమారులు సాయంత్రం ఇంటికి వచ్చారు. వరలక్ష్మి ఇంటి వద్ద లేకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశారు.

అప్పటికే మేతకు వెళ్లిన పశువులు సైతం ఇంటికి వచ్చేశాయి. రాత్రి అయినా వరలక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. గ్రామ సమీపంలోని పొలాలు, బావులు, చెరువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మళ్లీ గాలింపు ముమ్మరం చేశారు. ఇంతలో మదరసా సమీపాన చెరువు సమీపంలో వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె భర్త గురించి నిశ్చేష్టుడయ్యాడు. బండరాయితో తలపై మోది వరలక్ష్మిని హత్య చేసినట్టు ఉండడంతో  పీలేరు పోలీసులకు, వీఆర్‌ఓ సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్‌ఐ, వరలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ధరించిన నగలు అలాగే ఉండటం, దుస్తులు చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. హతురాలి భర్త, బంధువులు, గ్రామస్తులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు.  వివాహేతర సంబంధమేమై నా  హత్యకు దారితీసిందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదేరోజు అంత్యక్రియలు నిర్వహించారు.

చిత్తూరు, పుత్తూరు రూరల్‌ : వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం స్థానిక ఎన్‌టీఆర్‌ కాలనీ సమీపంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం..మండలంలో వేపగుంట క్రాస్‌ రోడ్డులోని ఎన్‌టీఆర్‌ కాలనీలో శంకరయ్య, ఆయన భార్య దేవకి (43) నివాసం ఉంటున్నారు. శంకర్‌ ఓ ప్రైవేట్‌ కాటన్‌ మిల్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల్లో ఇటీవలే ఒక కుమార్తెకు వివాహం చేశారు. దేవకి పశువులను మేపేది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటికి అవసరమైన వంటచెరకు (ముళ్లకంపలు) తెచ్చేందుకు వెళ్లింది. రాత్రి అయినా ఆమె జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం ముళ్లపొదల మధ్య ఆమె మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తిం చారు. గొంతు కోసి ఆమెను దుండగలు దారుణంగా హత్య చేశారని గుర్తించారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పుత్తూరు పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలంలో మూడు తాగి పడేసిన మద్యం బాటిళ్లు, వాటర్‌ ప్యాకెట్లు, మాంసాహారం తిన్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహం ఉన్న స్థితి బట్టి బుధవారం రాత్రి హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, కంపలు కొట్టే ఒక కొడవలిని అక్కడ స్వాధీనం చేసుకున్నారు.

డాగ్‌ స్క్వాడ్‌తో గాలింపు
సంఘటన స్థలానికి పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. అక్కడి నుంచి జాగిలాలు నేరుగా హతురాలి ఇంటి సమీపంలో ఉన్న మరో ఇంటి వద్దకు వెళ్లి ఆగాయి. దీంతో పోలీసులు సమీప ప్రాంతంలోని 30–35 ఏళ్లున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హతురాలి కుటుంబ సభ్యులు వినియోగిస్తున్న పశువుల కొట్టం స్థలంపై వివాదం ఉన్నట్టు తెలియవచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో హత్య చేశారా? మరే ఇతర కారణాలా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్చి ఉంది.

గస్తీ పటిష్టం చేయండి : ఎమ్మెల్యే రోజా
సంఘటనా స్థలాన్ని నగరి ఎమ్మెల్యే రోజా కూడా పరిశీలించారు. ఇటీవల పుత్తూరు పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు హత్యలు జరిగాయని వాటిని గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, సీసీ కెమెరాల పనితీరునూ సమీక్షించాలని పోలీసులకు సూచించారు.

మరిన్ని వార్తలు