కలప అక్రమ నిల్వపై కొరడా

30 Jan, 2019 11:26 IST|Sakshi
పురాణీపేట్‌లో చేసిన దాడుల్లో పట్టుకున్న కలపతో అటవీశాఖ అధికారులు(ఫైల్‌)

కమ్మర్‌పల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ నుంచి నిజామాబాద్‌ సామిల్లులకు కలపను అక్రమంగా తరలిస్తుండగా నిర్మల్‌ జిల్లా పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో జిల్లాలోని ఆయా అటవీ క్షేత్ర పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపపై అటవీ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కమ్మర్‌పల్లి అటవీ క్షేత్ర పరిధిలోని కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఉన్న సామిల్స్, టింబర్‌ డిపోలు, కార్పెంటర్‌ షాపులపై అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

రేంజ్‌ పరిధిలో 6 సామిల్స్, 6 టింబర్‌ డిపోలున్నాయి. మోర్తాడ్‌లో 2 నాన్‌ టీక్‌(టేకు కలప కాదు) సామిల్స్, భీమ్‌గల్‌లో 2 నాన్‌ టీక్, 2 టీక్‌ సామిల్స్‌ ఉన్నాయి. మోర్తాడ్‌లో 2, భీమ్‌గల్‌లో 4 టింబర్‌ డిపోలున్నాయి. భీమ్‌గల్, మోర్తాడ్‌లలోని సామిల్స్‌పై భీమ్‌గల్లోని ఓ టింబర్‌ డిపోపై అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమ కలప పట్టు బడలేదు. భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాల్లోని 18 గ్రామాల్లో ఉన్న కార్పెంటర్‌ షాపులపై దాడులు నిర్వహించి 12 మందిపై కేసులు నమోదు చేశారు. రూ.28 వేల విలువ చేసే 1.10 క్యూబిక్‌ మీటర్ల కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలపపై ఐదింతలు రూ.1.40 లక్షల జరిమానా విధించారు. అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలతో అక్రమ కలప రవాణాదారుల్లో అలజడి సృష్టిస్తున్నారు. 

గోదావరి తీరం నుంచి రవాణా.. 
గోదావరి నది తీర ప్రాంతం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీ ప్రాంతం నుంచి గత కొన్నేళ్లుగా జిల్లాలోని కమ్మర్‌పల్లి అటవీ క్షేత్ర పరిధిలోకి టేకు కలప అక్రమంగా రవాణా అవుతోంది. గోదావరి నది తీర ప్రాంతం ఏర్గట్ల మండలం దోంచంద, గుమ్మిర్యాల్‌ మీదుగా ఏర్గట్ల, ఉప్లూర్, మోర్తాడ్, తిమ్మాపూర్, పాలెం, తొర్తి, కమ్మర్‌పల్లి తదితర గ్రామాలకు టేకు కలప అక్రమంగా రవాణా అవుతోంది. ఇటీవల కలపను అక్రమంగా తరలిస్తుండగా నిర్మల్‌ పోలీసులు పట్టుకున్న ఘటన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు బేస్‌ క్యాంప్, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బందితో కలిసి గోదావరి తీరం వెంట రాత్రిపూట, పగటిపూట పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

గ్రామాల్లో కలపతో ఫర్నీచర్‌ తయారు చేసేవర్క్‌ షాపులపై  అటవీశాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు భీమ్‌గల్‌ మండలం పురాణీపేట్, మెండోర, మోర్తాడ్‌ మండలం పాలెం, మోర్తాడ్, కమ్మర్‌పల్లి గ్రామాల్లోని ఫర్నీచర్‌ వర్క్‌ షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దీంతో అక్రమ కలపతో ఫర్నీఛర్‌ తయారు చేసే కార్పెంటర్‌ల గుండెల్లో రైల్లు పరుగెత్తుతున్నాయి. ఇదివరకు వడ్రంగిల వద్ద ఉన్న దూగడ పట్టే యంత్రాలకు లైసెన్స్‌లు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.

తనిఖీలు చేస్తూనే ఉంటాం.. 
కలప అక్రమ రవాణా పై తనిఖీలు నిరంత రం కొనసాగుతూనే ఉంటాయి. అక్రమ కలపతో పట్టుబడితే కేసు నమోదు చేసి జైలుకు పంపుతాం. కలప అక్రమ రవాణా, అక్రమ నిల్వలపై ప్రజలు సెల్‌నం.7382633362కు సమాచారం అం దించి సహకారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. –మనోజ్‌కుమార్, ఎఫ్‌ఆర్‌ఓ, కమ్మర్‌పల్లి 

మరిన్ని వార్తలు