దుంగలు.. దొంగలు

22 Dec, 2018 12:04 IST|Sakshi
వల్లూరు సమీపంలో సీజ్‌ చేసిన విలువైన భారీ కలప దుంగలు

భారీగా కలప స్వాధీనం

ఫారెస్ట్‌ అధికారుల అదుపులో ఇద్దరు నిందితులు

వందేళ్లనాటి చెట్టు కలపగా అంచనా

తూర్పుగోదావరి, తుని రూరల్‌: తుని మండలం వల్లూరు శివారు సీతయ్యపేట సమీపంలో మామిడి తోటలో విలువైన 11 భారీ కలప దుంగలను ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులవుతున్నా విశాఖపట్నం జిల్లా కొయ్యూరు నుంచి విలువైన కలపను అక్రమంగా తరలించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క దుంగ చుట్టు కొలత ఎనిమిది నుంచి పది అడుగులు ఉన్నట్టు నిర్ధారించినట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు వల్లూరుకు చెందిన ఇద్దరు, సీతయ్యపేటకు చెందిన మరోఇద్దరు కలసి ఈ కలపను తీసుకువచ్చినట్టు తెలిసింది.

నలుగురిలో ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు కూలీలు. ప్రమాదాన్ని ముందే గ్రహించిన కలప వ్యాపారులు కూలీలను భాగస్వామ్యం చేసుకుని కలప రవాణా చేసినట్టు పేర్కొన్నారు. ట్రాలీలో తీసుకువచ్చిన కలపను పాయకరావుపేటలో కోతకు తీసుకువెళ్లగా సామిల్లు యజమాని భయంతో కోత కోసేందుకు అంగీకరించలేదని, దాంతో కలపను ఇక్కడకు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో కలప వ్యాపారులు ఎక్కువగా ఉండడంతో విలువైన కలప దుంగలను గుర్తించి, జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఫారెస్ట్‌ అధికారులు కలప దుంగలను సీజ్‌ చేశారు. విచారణ జరుపుతున్నారు. వందేళ్ల వయస్సుగల ఇంత విలువైన కలపను విశాఖపట్నం జిల్లా నుంచి ఫారెస్ట్‌ ఠాణాలను దాటుకుని రావడంలో ఉన్నత అధికారుల పాత్ర ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. దుద్దిక కలపగా వ్యాపారులు పేర్కొంటుండగా బండారు జాతికి చెందిన కలపగా ఫారెస్ట్‌ అధికారులు అంటున్నారు. రైతు నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు ఫారెస్ట్‌ ఠాణాలు దాటించేందుకు, రవాణా చార్జీలుగా రూ.లక్షల్లో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కలప అక్రమ రవాణా అరికట్టడంలో అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారనడానికి ఇదే నిదర్శనం.

>
మరిన్ని వార్తలు