గల్ఫ్‌లో శ్రమ దోపిడీ

13 Sep, 2019 12:14 IST|Sakshi
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఒమన్‌ నుంచి వచ్చిన గల్ఫ్‌ బాధితులు

ఏడాదిగా జీతాలివ్వని కంపెనీ

ఒమన్‌ దేశంలో కామారెడ్డివాసుల కష్టాలు

స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్వదేశానికి

సాక్షి, కామారెడ్డి: నాలుగురాళ్లు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆశతో గల్ఫ్‌బాట పట్టారు. కంపెనీ వీసా పేరుమీద పని దొరుకుతుందని తెలియడంతో రూ.లక్షలు పోసి దేశం కాని దేశానికి వెళ్లారు. మొదట్లో అక్కడ అంతా బాగానే గడిచింది. కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా పెరిగిపోయి జీతాలు పెరిగిపోయాయి. ఏడాదికిపైగా జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిలువునా దోపిడీకి గురైన తర్వాత చేసేదేమి లేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుప్పెడు దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని ఇళ్లకు తిరిగివచ్చారు. ఒమన్‌ దేశం నుంచి మొత్తం 13 మంది గల్ఫ్‌ కార్మికులు గురువారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో దిగారు. వీరిలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్మికులు. వీరిలో ఐదుగురు కామారెడ్డి జిల్లాకు చెందినవారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బుర్రస్వామిగౌడ్, గంగావత్‌ చందర్, మాచారెడ్డి మండలం ఫరీదుపేటకు చెందిన అబ్దూల్‌ మాజీద్, కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన రవి, చిన్నమల్లారెడ్డికి చెందిన పంపరి గోపాల్‌ ఉన్నారు.  

రూ.లక్షల్లో నష్టపోయారు..  
జిల్లాకు చెందిన కార్మికులు కంపెనీ వీసాపై ఓమన్‌ దేశంలోని మస్కట్‌లో హసన్‌ జుమాబాకర్‌ అనే భవన నిర్మాణ కంపెనీలో పని చేసేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లారు. ఆ సమయంలో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు వీసాలు, టిక్కెట్ల పేరిట చెల్లించుకున్నారు. మొదట కొంతకాలం జీతాలు సక్రమంగానే ఇచ్చిన కంపెనీ ఏడాది కాలంగా జీతాలు సక్రమంగా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష 50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు రావాల్సి ఉంది. జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ లాయర్‌ను సంప్రదించి కంపెనీ మీద కేసు వేశారు. ఇండియన్‌ ఎంబసిని కూడా ఆశ్రయించారు. ఎవరూ సరిగ్గా పట్టించుకోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీ ప్రతినిధులను గట్టిగా నిలదీస్తే బెదిరింపులు, జైల్లో పెట్టిస్తామని భయపెట్టేవారని తెలిపారు. గత ఫిబ్రవరి నుంచి పనులకు హాజరుకాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేక తిండికి కూడా కష్టంగా మారింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారు నివాసం ఉండే క్యాంపుల వద్దకు భోజనం తీసుకువచ్చి పెట్టేవారని బాధితులు చెబుతున్నారు. 

దాతల సహకారంతో స్వదేశానికి..  
కంపెనీ మోసంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించారు. వారు సహకారం అందించి అక్కడి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి స్వస్థలాలు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 
విషయం తెలుసుకున్న ఓమన్‌ తెలంగాణ ఫ్రెండ్స్‌ అనే సామాజిక సంస్థ కన్వీనర్‌ నరేంద్ర పన్నీరు వీరిని అక్కడి క్యాంపులో కలుసుకుని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.500 అందజేసినట్లు స్వస్థలాలకు చేరిన కార్మికులు తెలిపారు. మస్కట్‌ నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 13 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ విభాగం పక్షాన ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్‌ సిబ్బంది సహాయం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల సంఘం ప్రతినిధులు కోటపాటి నర్సింహానాయుడు, సురేందర్‌సింగ్‌ ఠాకూర్‌ బాధితులను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.  

అష్టకష్టాలు పడ్డాం...  
మొత్తం 45 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు మా కంపెనీలో పనిచేసేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 2.50 లక్షల వరకు సదరు కంపెనీ నుంచి జీతాలు రావాల్సి ఉంది. ఏడాదిగా ఇవ్వలేదు. అడిగితే జైల్లో పెడుతా మన్నారు. పని మానేశాక ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంబసి వారు కూడా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి వచ్చాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
  –అబ్దుల్‌ మాజిద్, ఫరీదుపేట, మాచారెడ్డి మండలం.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా