అధికారుల నిర్లక్ష్యంతోనే కార్మికుడి మృతి

27 Jun, 2018 09:01 IST|Sakshi
 ఆర్టీసీ డీఎంతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు   

వెంకటేష్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిపో ఎదట ధర్నా

షాద్‌నగర్‌టౌన్‌: ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ల్యంతోనే కార్మికుడు వెంకటేష్‌ మృతి చెందాడని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. షాద్‌నగర్‌ ఆర్టీసీ బస్‌ డిపోలో పని చేస్తున్న కార్మికుడు హైదరాబాద్‌లోని హకీంపేటలోని ఆర్‌టీసీ గ్యారేజీలో రెండు బస్సుల మధ్య నలిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వివిధ పార్టీల నాయకులు మంగళవారం షాద్‌నగర్‌ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.

వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన వెంకటేష్‌ (30) ఐటీఐ పూర్తి చేసి గత కొంత కాలంగా షాద్‌నగర్‌ ఆర్టీసీలో డీజిల్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే కాలం చెల్లిన బస్సును రిపేర్‌ నిమిత్తం ఆర్టీసీ వారు హైదరాబాద్‌లోని హకీంపేటకు పంపాచారు. బస్సు డ్రైవర్‌తో పాటుగా డీజిల్‌ మెకానిక్‌ వెంకటేష్‌ కూడ హకీంపేటకు వెళ్లాడు.

అయితే అక్కడ రెండు బస్సులు ఒకదాని వెంట మరొకటి నిలబడ్డాయి. ఓ బస్సును రివర్స్‌ తీసే క్రమంలో బస్సు వెనక నిలబడి ఉన్న వెంకటేష్‌  ప్రమాదవశాత్తు రెండు బస్సుల మధ్య చిక్కుకొని నలిగిపోయాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  

నష్టపరిహారం చెల్లించాలి... 

కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీయం, బీఎల్‌ఎఫ్‌ నాయకులతో పాటుగా వివిధ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. వెంకటేష్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అనుభవం లేని కార్మికుడిని బస్సు మరమ్మతులకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు.  ఈ సందర్భంగా షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో కారణంగా వెంకటేష్‌ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

మృతుడు వెంకటేష్‌ కుటుంబానికి పరిహారం అందజేస్తామని టీఆర్టీసీ డీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నాయకులు దంగు శ్రీనివాస్‌యాదవ్, శివశంకర్‌గౌడ్, ఎన్‌.రాజు, బుద్దుల జంగయ్య, నాగరాజు, ఈశ్వర్‌ నాయక్, అల్వాల దర్శన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు