వాట్సాప్‌లో వదంతులు

20 Apr, 2019 08:49 IST|Sakshi
పొన్నమరావతిలో పోలీసుల పహారా

ఓ వర్గానికి చెందిన మహిళలపై తప్పుడు సమాచారం

పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

ముగ్గురు పోలీసులు సహా 10 మందికి గాయాలు

పొన్నమరావతిలో ఉద్రిక్తత

టీ.నగర్‌: పుదుక్కోటై జిల్లా పొన్నమరావతి ప్రాంతంలో గురువారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు వాట్సాప్‌లో ఒక వర్గానికి చెందిన మహిళల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. కొందరు పొన్నమరావతి బస్టాండ్‌లో రాస్తారోకో చేపట్టారు. దుకాణాలను మూసివేయాల్సిందిగా హెచ్చరించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సెల్వరాజ్‌ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని చెప్పడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోసారి శుక్రవారం ఉదయం ఉద్రిక్తత కొనసాగింది. పొన్నమరావతి సహా 30కి పైగా గ్రామాల్లో అన్ని దుకాణాలు మూతబడ్డాయి.

అక్కడక్కడా రోడ్లపై చెట్లు నరికి దారికి అడ్డంగా వేశారు. దీంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. బస్టాండ్‌ నుంచి బయలుదేరిన బస్సులను నడపనీయకుండా ప్రజలు అడ్డగించి రాస్తారోకో చేపట్టారు. వేలాది మంది చీపురు కట్టలు, కర్రలు చేతబట్టి ర్యాలీగా బయలుదేరి పోలీసు స్టేషన్‌ చేరుకున్నారు. వాట్సాప్‌లో వదంతులు రేపిన వ్యక్తులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో పోలీసు స్టేషన్, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. ఇందులో ముగ్గురు పోలీసులు సహా 10 మందికి గాయాలయ్యాయి. ఉద్రిక్తత పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు పోలీసులు ఒక రౌండ్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీ చార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. 10 నిమిషాల తర్వాత వారు మళ్లీ పోలీసు స్టేషన్‌ ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న తిరుచ్చి సర్కిల్‌ డీఐజీ లలితా లక్ష్మి సంఘటనా స్థలం చేరుకుని విచారణ జరుపుతున్నారు.

144వ సెక్షన్‌ అమలు:ఇలావుండగా పొన్నమరావతిలో ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్‌ అక్కడ 144వ సెక్షన్‌ విధించారు.

మరిన్ని వార్తలు